సినీ నటుడు అలీ(Ali) అంటే తెలియని వారుండరు. చిన్న వయసులోనే సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి అంచెలంచెలుగా ఎదుగుతూ ఇప్పుడు టాలీవుడ్ లోని స్టార్ కమెడియన్లలో ఒకరిగా నిలిచారు. ఓవైపు వరుస సినిమాలు చేస్తూ.. మరోవైపు బుల్లితెరపై పలు టాక్ షోలు హోస్టు చేస్తూ బిజీబిజీగా ఉన్నారు. ఇంకోవైపు రాజకీయాల్లోనూ ఆయన యాక్టివ్ గా ఉన్నారు. తాజాగా అలీకి .. వికారాబాద్ జిల్లా నవాబ్‌పేట మండలం ఎక్‌మామిడి గ్రామ పంచాయతీ నోటీసులు (Ali Notices) ఇచ్చింది. ఇంతకీ ఏం జరిగింది అంటే..?
ఫామ్ హౌసులో అనుమతి లేకుండా నిర్మాణాలు
అనుమతి లేకుండా ఫామ్ హౌస్‌లో నిర్మాణాలు (Constructions in Farmhouse) చేస్తున్నారని నటుడు, కమెడియన్ అలీకి ఎక్ మామిడి గ్రామ పంచాయతీ నోటీసులు ఇచ్చింది. ఈ మేరకు గ్రామ పంచాయతీ కార్యదర్శి శోభారాణి ఆయనకు నోటీసులు (Actor Ali Summoned) జారీ చేస్తూ.. నిర్మాణాలు ఆపివేయాలని సూచించారు. అయితే దీనిపై అలీ స్పందించాల్సి ఉంది.
అనుమతి పొందకపోతే చర్యలు తప్పవు
ఎక్‌మామిడి రెవెన్యూ పరిధి సర్వే నెంబరు 345లోని ఫామ్ హౌస్‌లో నిర్మాణాలకు సంబంధించి పత్రాలను సమర్పించి అనుమతులు పొందాలని గతంలోనే అలీకి పంచాయతీ కార్యదర్శి (Panchayat Secretary) నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. అయితే ఆయన వాటిపై స్పందించలేదని వెల్లడించారు. ఈ క్రమంలోనే తాజాగా మళ్లీ రెండోసారి పంచాయతీ కార్యదర్శి నోటీసులు జారీ చేసినట్లు పేర్కొన్నారు. సంబంధించిన ధ్రువపత్రాలను సమర్పించి అనుమతులు పొందాలని.. లేని పక్షంలో పంచాయతీరాజ్ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని పంచాయతీ కార్యదర్శి శోభారాణి పేర్కొన్నారు.