Apsrtc Compassionate Appointments ఏపీఎస్ ఆర్టీసీ కారుణ్య నియామకాలపై దూకుడు పెంచింది. తాజాగా మరో 715మందికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేశారు. 2020 జనవరి నుంచి ఈ నియామకాలు చేపట్టారు.. వీరిలో డ్రైవర్లు, కండక్టర్లు సహా మరికొన్ని పోస్టులు ఉన్నాయి. నియామకాలకు చేపట్టాలని ఆయా జోన్ల ఈడీలు, ఆర్టీసీ అధికారులకు ఉత్తర్వుల్ని పంపారు. ఈ నిర్ణయంపై ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు ఆనందం వ్యక్తం చేశాయి.. ఏపీ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.
ఏపీఎస్ఆర్టీసీ కారుణ్య నియామకాలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనమయ్యాక.. అంటే 2020 జనవరి నుంచి మరణించిన ఉద్యోగుల వారసులకు కారుణ్య నియామకాలు చేపట్టేలా ఆదేశాలు జారీ అయ్యాయి. 346 డ్రైవర్లు, 90 కండక్టర్లు, 229 అసిస్టెంట్ మెకానిక్స్, 50 ఆర్టీసీ కానిస్టేబుల్స్ కలిపి మొత్తం 715 పోస్టుల్లో నియామకాలు చేపట్టేలా అన్ని జోన్ల ఈడీలు, జిల్లా ప్రజా రవాణాశాఖ అధికారులకు అడ్మినిస్ట్రేషన్ ఈడీ బ్రహ్మానందరెడ్డి ఉత్తర్వులు జారీచేశారు.
తొలుత అన్ని జిల్లాల్లో గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల్లో కలెక్టర్లు కారుణ్య నియామకాలు కింద ఎంపిక చేశారని తెలిపారు. ఇంకా మిగిలిన దరఖాస్తులు ఆర్టీసీకి అధికారులకు చేరినందున.. వాటిని పరిశీలించి అర్హులైన వారికి 715 పోస్టుల్లో భర్తీచేయాలని ఉత్తర్వులో పేర్కొన్నారు. తాజగా ప్రభుత్వం జారీ చేసిన ఈ ఉత్తర్వుపై నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ (ఎన్‌ఎంయూఏ), ఎంప్లాయిస్ యూనియన్ (ఈయూ) హర్షం వ్యక్తం చేశాయి. కారుణ్య నియామకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినందుకు ఆయా కుటుంబాల వారు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.
అంతకముందు కూడా ఏపీఎస్ ఆర్టీసీ మరో నిర్ణయం తీసుకుంది. 2016 జనవరి నుంచి 2019 డిసెంబరు మధ్య కాలంలో చనిపోయిన ఉద్యోగులకు సంబంధించి కారుణ్య నియామకాలు చేపట్టారు. ఆ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇచ్చారు.. మొత్తం 294 మందికి కారుణ్య నియామకం కింద ఉద్యోగ అవకాశాలు దక్కాయి. వీటిలో 99 ఆర్టీసీ కానిస్టేబుల్, 99 అసిస్టెంట్ మెకానిక్, 61 కండక్టర్, 34 జూనియర్ అసిస్టెంట్, ఒక డ్రైవర్ పోస్టును భర్తీ చేశారు. 2016 జనవరి నుంచి 2019 డిసెంబర్ మధ్య కాలంలో చనిపోయిన ఉద్యోగుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇచ్చింది ప్రభుత్వం. ఈ నిర్ణయంపై ఆయా కుటుంబాలు సంతోషం వ్యక్తం చేశాయి.