Mana Enadu : బంగాళాఖాతంలో ‘దానా’ తుపాను (Dana Cyclone) తీవ్రత క్రమంగా పెరుగుతోందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఒడిశాలోని పూరీ, పశ్చిమబెంగాల్‌లోని సాగర్ ద్వీపానికి మధ్యలో బిత్తర్‌కనిక, ధమ్రా (ఒడిశా)కు సమీపంలో గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాములోగా తీరం దాటవచ్చని వెల్లడించారు. దీని ప్రభావంతో ఒడిశా, పశ్చిమబెంగాల్‌లోని కొన్ని ప్రాంతాల్లో 21 సెం.మీ. కంటే ఎక్కువ వర్షపాతం కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. మిగిలిన ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు.
ఏపీలో భారీ వర్షాలు
మరోవైపు రాబోయే మూడు రోజుల్లో ఏపీ వ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు(AP Rains) కురవవచ్చని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ‘దానా’ తుపాను ప్రభావం(AP Cyclone Dana Effect)తో శుక్రవారం ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశముందని తెలిపింది. కృష్ణపట్నం, వాడరేవు, నిజాంపట్నం, మచిలీపట్నం, కాకినాడ, గంగవరం, విశాఖపట్నం, కళింగపట్నం పోర్టులకు రెండో నంబరు హెచ్చరిక జారీ చేసింది. సముద్రం అలజడిగా మారిన నేపథ్యంలో శనివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించింది.
రైళ్లు రద్దు.. పరీక్షలు వాయిదా
‘దానా’ తుపాను ప్రభావంతో ముందు జాగ్రత్త చర్యగా ఈస్ట్రన్ రైల్వే సీల్దా డివిజన్‌లో గురువారం రాత్రి 8 గంటల నుంచి శుక్రవారం ఉదయం 10 గంటల మధ్య 190 రైళ్లను రద్దు(Dana Effect Trains Cancel) చేశారు. మరోవైపు దక్షిణ మధ్య రైల్వే 14 రైళ్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు దాదాపు 200 రైలు సర్వీసులను రద్దు చేయడం లేదా దారి మళ్లించారు. తుపానుతో అప్రమత్తమైన ఒడిశా ప్రభుత్వం ముందస్తు చర్యల్లో భాగంగా 23వ తేదీ నుంచి 25 వరకు జరగాల్సిన పరీక్షలన్నింటినీ(Odisha Exams Postponed) రద్దు చేసింది. తాజాగా ఈ నెల 27న జరగాల్సిన ఒడిశా సివిల్ సర్వీస్ ప్రిలిమినరీ పరీక్షను కూడా వాయిదా వేసింది.