యూకేలో ఘనంగా సంక్రాంతి సంబరాలు
ఏ దేశమేగినా.. మన తెలుగు జాతి వైభవాన్ని, సంస్కృతీ సంప్రదాయాలను కీర్తి శిఖరాన నిలపడంలో మన తెలుగోళ్లు ఎప్పుడూ ముందుంటారు. ఇంగ్లాండ్‌లోని సోలిహల్ తెలుగు అసోసియేషన్ రైస్ (స్టార్) నిర్వాహకులు అందులో ఇంకాస్త ముందు. పదేళ్ల క్రితం ఆవిర్భవించిన ఈ సంఘం ద్వారా సోలిహల్ తో పాటు బర్మింగ్‌హమ్ ఇతర చుట్టుపక్కల నగరాల్లో స్థిరపడిన తెలుగు కుటుంబాలన్నింటినీ ప్రతీ వేడుకకూ ఒక్కచోట చేర్చుతున్నారు. తర్వాతి తరాలకు భారతీయ సంప్రదాయాలను పరిచయం చేస్తున్నారు.
యూకేలోని సోలిహల్ నగరంలో స్టార్ (సోలిహల్ తెలుగు అసోసియేషన్ రైస్) ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. యూకేలో స్థిరపడిన దాదాపు 300కు పైగా తెలుగు కుటుంబాలు ఈ వేడుకల్లో పాల్గొన్నాయి. తెలుగు పండగల ఔన్నత్యాన్ని చాటడంతో పాటు మన సంస్కృతి సంప్రదాయాలకు దూరమవొద్దనే వేడుకలు నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. భోగిపళ్లు, రంగోలి ముగ్గులతో పాటు చిన్నారుల ఆటపాటలు, సాంస్కృతిక నృత్యాలు, వివిధ కళారూపాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా మద్దికుంట గగన, శ్వేత ప్రభాకరన్, ముల్లపూడి ప్రణవ్, హ్రితి, రిషిక్ వ్యవహరించారు. స్టార్ ప్రతినిధులు నీన అనంతుల, ప్రతిభా సిస్ట్లా, కల్లేపల్లి తులసీదేవి, చైతన్య ఇందుకూరి, చందన అడప, పవన్ మద్దికుంట, సురేష్ ఉపాధ్యాయుల, అల్లూరి రవివర్మ, పెన్మత్స మదన్, జొన్న వంశీ కార్యక్రమ నిర్వహనలో పాలుపంచుకున్నారు.