విద్యార్థి కేంద్రీకృతంగా ఉన్నత విద్యలో బోధన జరగాలని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ వీసీ నిమ్మ వెంకటరావు అన్నారు.
వర్సిటీలో గురువారం నిర్వహించిన బోర్డ్ ఆఫ్ స్టడీస్ (బీవోఎస్) చైర్మన్లు, సభ్యులతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గత మూడేళ్లలో బీఆర్‌ఏయూ ఎన్నో విద్యా సంస్కరణలు చేపట్టిందన్నారు. జాతీయ విద్యా విధానం 2020ను అమలు చేయడంలో బీఆర్‌ఏయూ ముందంజలో ఉందన్నారు. ఉపాధికి ఉపయుక్తంగా ఉండేలా వివిధ కోర్సులను ప్రారంభించామన్నారు. దక్షిణ భారతదేశంలోనే సమీకృత నాలుగేళ్ల ఉపాధ్యాయ కోర్సు నిర్వహణకు అనుమతి పొందిన ఏకైక వర్సిటీ బీఆర్‌ఏయూ అని చెప్పారు. వర్సిటీ అకడమిక్ డీన్ బిడ్డిక అడ్డయ్య మాట్లాడుతూ.. వర్సిటీలో అకడమిక్ ప్రగతి, చేపట్టిన కార్యక్రమాల నివేదికను వివరించారు.
వర్సిటీ రిజిస్ట్రార్ సీహెచ్‌ఏ రాజేంద్రప్రసాద్, విద్యా రంగ నిపుణులు ప్రొఫెసర్ గంటా రమేష్, ప్రొఫెసర్ ఎస్.పద్మనాభయ్య, ప్రొఫెసర్ బీఎస్ పండా తదితరులు మాట్లాడారు. వర్సిటీ ప్రిన్సిపాల్స్ ఎస్.ఉదయభాస్కర్, సీహెచ్ రాజశేఖరరావు, రిటైర్డు ప్రొఫెసర్ పి.చిరంజీవులు, కృష్ణా యూనివర్సిటీ ప్రిన్సిపాల్ ఎస్వీ బసవేశ్వరరావు, ఇగ్నో (విజయవాడ) కేంద్ర సంచాలకులు డాక్టర్ ప్రసాదబాబు, ప్రొఫెసర్ పీఎస్ అవధాని, కె.రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. వర్సిటీలోని వివిధ విభాగాలు ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లో బీవోఎస్ సమావేశాలు నిర్వహించారు.