14000 మంది చిన్నారులు.. 100 మంది బ్రిటిష్‌ ఆర్కెస్ట్రాతో జనగణమన.. గ్రామీ విన్నర్ గిన్నిస్ రికార్డు

ManaEnadu:78 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఇవాళ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. దిల్లీలోని ఎర్రకోటలో ప్రధానిమోదీ జాతీయ జెండా ఎగురవేశారు. ఆయా రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు మువ్వన్నెల జెండాకు సలామ్ కొట్టారు. ఇక స్వాతంత్య్ర దినోత్సవ పోస్టులతో సోషల్ మీడియా హోరెత్తుతోంది. మరోవైపు భారత్‌కు ప్రపంచ దేశాలు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు చెబుతున్నారు.

ఈ సందర్భంగా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన భారతీయ సంగీత దర్శకుడు, గ్రామీ విన్నర్ రిక్కీ కేజ్.. 78వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని అద్భుతమైన వీడియోను రూపొందించారు . ప్రముఖ సంగీతకారులతో కలిసి భారతదేశ జాతీయ గీతాన్ని ఆలపించారు. 100 మంది సంగీత నిపుణులు కలిగిన బ్రిటిష్‌ ఆర్కెస్ట్రాతో, 14వేల మంది ఆదివాసీ చిన్నారులతో ఈ వీడియో తయారు చేశారు. ఈ వీడియో గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డుల్లో చోటు దక్కించుకోవడం విశేషం.

ఈ వీడియోను రిక్కీ కేజ్‌ తన సోషల్‌ మీడియా ఖాతాలో షేర్‌ చేస్తూ తాము రూపొందించిన ఈ వీడియో గిన్నిస్ రికార్డు సొంతం చేసుకుందని తెలిపారు. ఇక ఈ వీడియోలో పండిత్‌ హరిప్రసాద్‌ చౌరాసియా, రాకేశ్‌ చౌరాసియా, రాహుల్‌ శర్మ, అమన్‌, అయాన్‌ అలి బంగాశ్‌, కలీషాబీ మహబూబ్‌, జయంతి కుమరేశ్‌, షేక్‌ మహబూమ్‌ వంటి ప్రముఖ క్లాసికల్‌ మ్యుజీషియన్లు తమ వాద్యాలతో జాతీయ గీతాన్ని ప్రత్యేకంగా పలికించారు.

వీరితో పాటు యూకేలోని రాయల్‌ ఫిల్‌హర్మోనిక్‌ ఆర్కెస్ట్రా కు చెందిన 100 మంది సభ్యుల బృందం ఇందులో భాగమైంది. ఇక వీడియో చివరలో కలింగ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌కు చెందిన 14వేల మంది ఆదివాసీ చిన్నారులు భారతదేశ చిత్రపటం ఆకృతిలో, ‘భారత్‌’ అక్షరక్రమంలో నిల్చుని జాతీయ గీతాన్ని ఆలపించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

https://x.com/rickykej/status/1823676540867187092

Share post:

లేటెస్ట్