కాంగ్రెస్ ప్రభుత్వానికి, పార్టీ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న కొందరు బీఆర్ఎస్ నాయకులు తమతో టచ్ లో ఉన్నారని పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ (mahesh kumar goud) చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. త్వరలోనే వారు కాంగ్రెస్ పార్టీలో చేరుతారని అన్నారు. ఈ మేరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన బీజేపీ మాజీ ఎంపీ సోయం బాపూరావు,బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు గురువారం గాంధీభవన్లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీ నాయకులు తమ పార్టీలో చేరుతున్నారని అన్నారు. గతంలో బీఆర్ఎస్ బెదిరింపులకు పాల్పడి పార్టీ ఫిరాయింపులు చేసిందని ఆరోపించారు. ‘కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకం. మరికొన్ని రోజుల్లోనే పదిమందికి పైగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో (congress party) చేరుతారు’ అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన వారికి తగిన ప్రాధాన్యం తప్పక ఉంటుందని పేర్కొన్నారు. బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్ రావు, (harish rao) పాడి కౌశిక్ రెడ్డి (padi koshik) అరెస్టులపై ఆయన స్పందిస్తూ.. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందని.. కానీ, ఇష్టారాజ్యంగా మాట్లాడితే చట్టం తన పని తాను చేసుకుపోతుందని అన్నారు.
ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు కూడా పరిధిలు ఉంటాయని, చట్టాన్ని ఎవరైనా చేతుల్లోకి తీసుకోవాలని ప్రయత్నిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. చట్టం ఎవరికీ చుట్టం కాదు, తప్పు చేస్తే చర్యలు కచ్చితంగా ఉంటాయని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. గత బీఆర్ఎస్ (brs) పాలనలో నిరసన చేసుకుకే హక్కు కూడా కల్పించలేదని, మా నాయకులను ఎన్నోసార్లు అరెస్ట్ చేశారని గుర్తుచేశారు. కొంతమంది బీఆర్ఎస్ నేతలు అదే పనిగా మాపై లేని పోని విమర్శలు చేస్తున్నారు, వారు కూడా మాతో టచ్ లో ఉన్నారన్నారు. ఈ సందర్భంగా సోయం బాపూరావు, ఆత్రం సక్కు మాట్లాడుతూ.. రేవంత్ (revanth reddy) ప్రభుత్వం ఆదివాసీల సంక్షేమానికి చేస్తున్న కృషి హర్షనీయమని తెలిపారు. ఆదివాసీలపై చూపిస్తున్న శ్రద్ధకు ఆకర్షితులమై కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావు, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, తదితరులు ఉన్నారు.






