దేశవ్యాప్తంగా గ్యాస్ ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో, సాధారణ ప్రజలకు, హోటల్ రంగానికి, చిన్న వ్యాపారులకు తీవ్ర సమస్యగా మారింది. ఎప్పటికప్పుడు పెరుగుతున్న కమర్షియల్ గ్యాస్ ధరలతో రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.
ఈ నేపథ్యంలో కమర్షియల్ గ్యాస్ వినియోగదారులకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు గుడ్ న్యూస్ చెప్పింది. చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రతి నెల మొదటి తేదీన పెట్రో ఉత్పత్తులపై సమీక్ష నిర్వహించే భాగంగా, ఈసారి వాణిజ్య గ్యాస్ సిలిండర్ల(Gas Cylinder) ధరను రూ.33.50 తగ్గించే నిర్ణయం తీసుకున్నాయి. ఈ తగ్గిన ధరలు ఆగస్టు 1 (శుక్రవారం) నుంచి అమల్లోకి రానున్నట్లు ప్రకటించాయి.
ఈ తగ్గింపు కేవలం వాణిజ్య (కమర్షియల్) సిలిండర్లకే వర్తించనుంది. తాజా తగ్గింపు తర్వాత 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధర ఇప్పుడు రూ.1,531.50కి చేరింది (ఢిల్లీ మార్కెట్‌లో). ఇవి హోటల్స్, రెస్టారెంట్లు, బేకరీలు వంటి వాణిజ్య అవసరాలకు ఉపయోగించే సిలిండర్లు. అయితే గృహావసరాలకు వినియోగించే 14.2 కిలోల LPG సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం హైదరాబాద్‌లో గృహ వినియోగ సిలిండర్ ధర సుమారు రూ.905గా ఉంది.






