ManaEnadu:చిన్న జలుబు, తలనొప్పి వచ్చినా.. ఇప్పుడు మాత్రలు (Medicine) మింగడం బాగా అలవాటైంది. ప్రస్తుతం చాలా మంది లేవగానే బ్రేక్‌ఫాస్ట్ కంటే ముందు అరడజనుకుపైగా మందులు మింగాల్సి వస్తోంది. వాటిలో ఎక్కువగా ఇన్ఫెక్షన్లు (Infections), ఇతర సమస్యలకు యాంటీబయాటిక్స్‌ను వాడుతున్నారని గ్లోబల్ రీసెర్చ్ వెల్లడించింది. అవసరం లేని వ్యాధులకు కూడా ఈ గోలీల వాడకం ఎక్కువైందని తెలిపింది. అతిగా యాంటీబయాటిక్స్‌ను వాడటం ప్రాణాంతకమని హెచ్చరించింది.
సూపర్ బగ్స్‌తో మరణం
బ్యాక్టీరియా, శిలీంధ్రాలను చంపడానికి వాడే యాంటీబయాటిక్స్‌ను ఎదుర్కొనే క్రమంలో AMRగా రూపాంతరం చెంది చికిత్సలేని సూపర్ బగ్స్ తయారవుతున్నాయని హెచ్చరిస్తున్నారు. దీనివల్ల ఇన్ఫెక్షన్లకు చికిత్స, ఇతర సర్జరీలు, క్యాన్సర్ ట్రీట్‌మెంట్స్ (Cancer Treatments) మరింత కష్టతరంగా మార్చుతోందని వెల్లడించారు. యాంటీమైక్రోబియల్ రెసిస్టెంట్‌పై నిర్వహించిన గ్లోబల్ రీసెర్చ్ (GRAM)లో చికిత్స లేని సూపర్‌బగ్స్ ప్రభావం వల్ల 2050 నాటికి దాదాపు 4 కోట్ల మంది చనిపోయే అవకాశం ఉందని తేలినట్లు లాన్సెంట్ జర్నల్ (The Lancet Journal) ప్రచురించింది.
భవిష్యత్‌లో మరింత ముప్పు
నిజానికి యాంటీ మైక్రోబియల్ ఔషధాలు ఆధునిక ఆరోగ్య సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిసిందే. అయితే, వాటిని ఎదుర్కోవడానికి బ్యాక్టీరియా, శిలీంద్రాలు చేసే ప్రయత్నం ఆందోళన కలిగిస్తోందని ఈ జర్నల్ పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా 1990 నుంచి 2021 మధ్య యాంటీమైక్రోబియల్ రెసిస్టెంట్ (AMR) వల్ల 10 లక్షల మంది చనిపోయారని వెల్లడించింది. ఈ సమస్య వెంటనే పరిష్కరించకపోతే భవిష్యత్‌లో ఆ సంఖ్య మరింత పెరుగుతుందని గ్లోబల్ రీసెర్చ్ ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిపింది.
భవిష్యత్‌లో 4 కోట్ల మరణాలు
గ్లోబల్ రీసెర్చ్‌ను నిర్వహించే పరిశోధక బృందం యాంటీమైక్రోబయాల్ రెసిస్టెన్స్ (GRAM) ప్రాజెక్ట్ కింద అధ్యయనం చేశారు. భారత్ (India), పాకిస్తాన్, బంగ్లాదేశ్‌తో సహా దక్షిణాసియాలో యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ నుంచి భవిష్యత్తు మరణాలు ఎక్కువగా ఉంటాయని ఈ అధ్యయనంలో తేలింది. 2025 – 2050 మధ్య మొత్తం 11.8 మిలియన్ల మరణాలు ఉంటాయని హెచ్చరించారు. 204 దేశాల్లో అన్న వయస్సుల నుంచి 520 మిలియన్ల మందికి సంబంధించిన వివరాలను ఆసుపత్రుల రికార్డులను విశ్లేషించి, వీరి యాంటీబయాటిక్ వినియోగ సమాచారంతో సహా అనేక రకాల డేటాల ఆధారంగా ఈ విశ్లేషణ జరిపారు.