ManaEnadu:ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ (NDA Govt).. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా రాష్ట్ర ఆడపడుచులకు గుడ్ న్యూస్ చెప్పింది. సూపర్ సిక్స్ (Super Six) లో భాగంగా ప్రకటించిన ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ పథకం కీలక అప్డేట్ ఇచ్చింది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. ఇంతకీ ఈ పథకం ఎప్పుడు ప్రారంభం కాబోతోంది అంటే..?
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu) అధ్యక్షతన కేబినెట్ భేటీ ఇవాళ (సెప్టెంబరు 18వ తేదీ) జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో ఒకటే ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం (Free LPG Gas Cylinder Scheme). ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా ఈ పథకంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు ముందుకేసింది.
మహా శక్తి పథకం
మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని దీపావళి పండుగ (Diwali Festival) సందర్భంగా అమలు చేయాలని సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీలో నిర్ణయించారు. ఇదే విషయాన్ని ఎన్డీయే శాసనసభాపక్ష సమావేశంలో సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. మహాశక్తి పథకం (Maha Shakti Scheme) కింద పేదలకు ఉచితంగా మూడు వంట గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన సంగతి తెలిసిందే.
ప్రతి ఇంటికి 3 ఫ్రీ గ్యాస్ సిలిండర్లు
ఈ పథకం ద్వారా తెల్ల రేషన్ కార్డు ఉన్న లబ్ధిదారులకు.. ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ప్రభుత్వం అందించనుంది. త్వరలోనే ఈ పథకానికి సంబంధించి లబ్ధిదారుల ఎంపిక, విధివిధానాలు ఖరారు చేయనున్నట్లు సమాచారం. మరోవైపు ఇవాళ్టి కేబినెట్ భేటీ (Ap Cabinet Meeting) లో నూతన మద్యం విధానానికి ఆమోదం లభించింది. నాణ్యమైన మద్యం బ్రాండ్లు అందుబాటులో ఉంచాలని నిర్ణయించిన మంత్రివర్గం సగటు మద్యం ధర (Liquor Price in AP) రూ.99 నుంచి అందుబాటులో ఉంచాలని నిర్ణయానికి వచ్చింది.
స్టెమీ పథకం ప్రారంభం
మరోవైపు భోగాపురం విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు విమానాశ్రయంగా నామకరణం చేస్తూ నిర్ణయం తీసుకుంది. పోలవరం డయాఫ్రమ్ (Polavaram Project) వాల్ నిర్మాణం సీడబ్ల్యూసీ సూచనల మేరకు పాత ఏజన్సీకే ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది. అలాగే ప్రజారోగ్యానికి ప్రాధాన్యమిస్తూ ‘స్టెమీ’ పథకం ప్రారంభించాలని, ఆధార్ తరహాలో విద్యార్థులకు ‘అపార్’ గుర్తింపు కార్డులు ఇవ్వాలని, హోంశాఖలో కొత్త కార్పొరేషన్ ఏర్పాటుకు రూ.10 కోట్ల కార్పస్ ఫండ్ మంజూరు చేయాలని నిర్ణయానికి వచ్చింది. వాలంటీర్లను, సచివాలయాలను వివిధ శాఖల్లో కలిపేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.