Mana Enadu : ‘మాది మంచి ప్రభుత్వమే కానీ.. మెతక ప్రభుత్వం కాదు’ అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) ఉద్ఘాటించారు. ఐఏఎస్ అధికారులకు వార్నింగ్ ఇస్తే సుమోటోగా కేసులు పెడతామని వార్నింగ్ ఇచ్చారు. ఇరవై ఏళ్లు అధికారంలో ఉంటామని అధికారులను ఇష్టమొచ్చినట్లు ఉపయోగించుకున్నారని పరోక్షంగా జగన్ సర్కార్ (YS Jagan Govt) పై ధ్వజమెత్తారు. గుంటూరులో నిర్వహించిన అటవీశాఖ అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో పవన్ పాల్గొని ప్రసంగించారు.
అధికారులపై గాటు పడినా ఊరుకోం
అధికారులపై చిన్న గాటు పడినా చూస్తూ ఊరుకోబోమని పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల (YS Sharmila) అడిగితే భద్రత కల్పిస్తామని.. మహిళా భద్రత విషయంలో సమాజంలో ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. గంజాయిని పూర్తిగా నిర్మూలించేందుకు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నామని స్పష్టం చేశారు.
నా ఫుల్ సపోర్ట్ మీకే
“అటవీ శాఖకు నా సంపూర్ణ మద్దతు ఉంటుంది. అడవుల రక్షణ(Forests)కు అటవీ అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నాం. అటవీ శాఖలో ఉద్యోగం నిర్వహిస్తూ అమరులైన వారి త్యాగాలు ఎన్నటికీ మరవకూడదు. వివిధ వర్గాల నుంచి ఈ శాఖకు విరాళం సేకరిస్తాను. రూ.5 కోట్ల విరాళం సేకరించాలని లక్ష్యం పెట్టుకున్నాను. ఈ శాఖలో ఉన్న సిబ్బంది కొరతను గుర్తించాం. త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం. విధులు నిర్వహిస్తూ ప్రాణాలు కోల్పోయిన 23 మంది పేర్లను ఫారెస్ట్ ఆఫీస్ బ్లాక్ లకు పెట్టాలి’’ అని పవన్ కల్యాణ్ అన్నారు.