Mana Enadu : గ్రూప్-4 పరీక్షలు(Group-4) రాసి ఎంపికైన అభ్యర్థులకు గుడ్ న్యూస్. రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ వారికి నియామక పత్రాలు అందజేయనుంది. వివిధ శాఖల్లో గ్రూప్ 4 ఉద్యోగాలకు ఎంపికైన 8 వేల 143 మందికి బుధవారం రోజున పెద్దపల్లిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నియామక పత్రాలు అందజేస్తారు. మరోవైపు ఇదే వేదికపైన వైద్యారోగ్య శాఖ ఎంపిక చేసిన 442 మంది అసిస్టెంట్ సర్జన్లు, సింగరేణి ఉద్యోగాలు దక్కించుకున్న 593 మంది కూడా పత్రాలు అందుకోనున్నారు.
ఏడాదిలో 54వేల కొలువులు
అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో 54,520 ఉద్యోగాలు భర్తీ చేసినట్లు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం (Telangana Govt) తెలిపింది. టీజీపీఎస్సీ (TGPSC) ద్వారా 12,324 ఉద్యోగాలు, వైద్యారోగ్య నియామక బోర్డు 7,378.. పోలీసు నియామక సంస్థ ద్వారా 16,067.. గురుకుల విద్యా సంస్థల నియామక బోర్డు ద్వారా 8,304.. డీఎస్సీ ద్వారా 10,006 .. ఇతర సంస్థల ద్వారా మరో 441 ఉద్యోగాలు కల్పించినట్లు వెల్లడించింది. ఇక తాజాగా గ్రూప్-4తో పాటు, సింగరేణి (Singareni), వైద్యారోగ్య శాఖ ఉద్యోగ నియామక ప్రక్రియలో ఎంపికైన 9 వేల మందికి ఇవాళ నియామక పత్రాలు ఇవ్వనున్నారు.
8వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు
ఇక వివిధ శాఖల్లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ కోసం టీజీపీఎస్సీ 2022 డిసెంబరు 1న నోటిఫికేషన్ జారీ చేయగా 9,51,321 మంది దరఖాస్తు చేసుకున్నారు. గతేడాది జులై 1న రాత పరీక్ష, ఆ తర్వాత ధ్రువపత్రాల పరిశీలన అనంతరం టీజీపీఎస్సీ 8,143 మందిని ఎంపిక చేసింది. వీరంతా ఇప్పుడు పురపాలక (Municipality), ఆర్థిక, వ్యవసాయ, పశుసంవర్ధక, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, మహిళ సంక్షేమ, పౌరసరఫరాలు, అటవీ, జీఏడీ, వైద్యారోగ్య, విద్య, హోం, పరిశ్రమలు, కార్మిక, పంచాయతీ రాజ్, ప్రణాళిక, రెవెన్యూ , రవాణ, టూరిజం శాఖలు, యూనివర్సిటీలు, హెచ్ఎండీఏ(HMDA)లో జూనియర్ అసిస్టెంట్లుగా విధులు నిర్వహించనున్నారు.






