
ప్రస్తుతం టాలీవుడ్ లో రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తోంది. గతంలో రిలీజ్ అయి ప్రేక్షకుల మనసు గెలిచిన చిత్రాలు మరోసారి వారికి వినోదం పంచేందుకు థియేటర్లలోకి వచ్చేస్తున్నాయి. మరోవైపు మొదటి సారి విడుదలైనప్పుడు ప్రేక్షకులను పెద్దగా అలరించని.. ఆ తర్వాత టీవీల్లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమాలను మరోసారి రిలీజ్ చేస్తే వెండితెరపై చూడాలని ప్రేక్షకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అలాంటి చిత్రాలను కూడా నిర్మాతలు రీ రిలీజ్ చేస్తున్నారు. ఇక రీ రిలీజ్ లకు కూడా విపరీతంగా ఆదరణ లభిస్తోంది. ఈ సినిమాలు మరోసారి నిర్మాతలకు కాసులు కురిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆ జాబితాలో చేరబోతోంది నందమూరి బాలకృష్ణ (Balakrishna) నటించిన ఆదిత్య369 సినిమా.
బాలయ్య అభిమానులకు తీపికబురు
బాలయ్య నటించిన క్లాసిక్ చిత్రాల్లో ఒకటి ఆదిత్య 369 (Aditya369). సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. అప్పటి ప్రేక్షకులే కాదు ఈ సినిమా ఈ తరం ఆడియెన్స్ నూ మెప్పించింది. చాలా మంది యూట్యూబ్ లో ఈ సినిమాను వీక్షించారు. అయితే మరొక్కసారి ఈ సినిమాను వెండితెరపై చూడాలని చాలా మంది ప్రేక్షకులు ఉవ్విళ్లూరుతున్నారు. ఈ నేపథ్యంలో వారి కోరిక మేరక్ మేకర్స్ ఆదిత్య 369 సినిమాను థియేటర్లలో రీ రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. ఇటీవలే ఈ విషయాన్ని ప్రకటించారు కూడా.

ఆదిత్య 369 రీ రిలీజ్ డేట్
అయితే తాజాగా మేకర్స్ ఆదిత్య 369 సినిమా రీ రిలీజ్ డేట్ (Aditya369 Re Release Date) ను ప్రకటించారు. ఈ చిత్రం వచ్చిన 34 ఏళ్ల తర్వాత మళ్లీ రీ రిలీజ్ చేయబోతున్నారు. అయితే మొదట సమ్మర్ కానుకగా మే నెలలో విడుదల చేయాలని భావించారు. కానీ తాజాగా బాలయ్య అభిమానులకు గుడ్ న్యూస్ చెబుతూ ఓ నెల ముందుగానే థియేటర్లలోకి తీసుకురానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఆదిత్య 369 చిత్రాన్ని ఏప్రిల్ 4వ తేదీన రీ రిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. సింగీతం శ్రీనివాస రావు (Singeetam Srinivasa Rao) తెరకెక్కించిన ఈ చిత్రంలో బాలయ్య, మోహిని, అమ్రిష్ పురి, టినూ ఆనంద్, సుత్తివేలు కీలక పాత్రల్లో నటించారు. ఎస్. అనిత కృష్ణ ఈ సినిమాను నిర్మించారు, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం సమర్పణలో శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై ఈ మూవీ రూపొందింది.