
టీమిండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ (Yuzvendra Chahal) అతడి భార్య ధనశ్రీ వర్మ (dhanashree verma) విడాకుల వ్యవహారం గత కొంతకాలంగా మీడియాలో బాగా వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ జంట సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్ ఫాలో చేయడం, ఫొటోలు డిలీట్ చేయడంతో ఈ వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇక ఆ తర్వాత ఈ జంట వేర్వేరుగా పెట్టిన పోస్టులు కూడా ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చాయి. అయితే తాజాగా ఈ జంటకు కోర్టు విడాకులు మంజూరు చేసినట్లు నేషనల్ మీడియా కోడై కూస్తోంది.
ధనశ్రీ-చాహల్ కు విడాకులు
గురువారం రోజున బాంద్రా ఫ్యామిలీ కోర్టు (Bandra Family Court)లో తుది విచారణకు ఈ జంట హాజరైంది. విచారణ సమయంలో న్యాయమూర్తి ఈ జంటను కౌన్సెలింగ్ సెషన్‌కు హాజరు కావాలని ఆదేశించగా దాదాపు 45 నిమిషాల పాటు కౌన్సెలింగ్ జరిగింది. ఇక చివరలో విడిపోవడానికి సమ్మతమేనా? అని జంటను ప్రశ్నించగా, చాహల్ – ధనశ్రీ ఇద్దరూ పరస్పర అంగీకారంతో విడాకులు కోరుతున్నట్లు ధృవీకరించారని ఏబీపీ న్యూస్ కథనాలు వెల్లడించాయి.
నో కామెంట్స్
పూర్తి విచారణ తర్వాత న్యాయమూర్తి ఈ జంటకు అధికారికంగా విడాకులు (Chahal Dhanashree Divorce) మంజూరు చేస్తూ చాహల్ – ధనశ్రీ ఇకపై భార్యాభర్తలుగా చట్టబద్ధంగా కలిసి ఉండలేరు అని ప్రకటించారు. బాంద్రా ఫ్యామిలీ కోర్టు గురువారం సాయంత్రం 4:30 గంటలకు తుది తీర్పు వెలువరించిందని మీడియా వెల్లడించింది. అయితే ఈ జంట ప్రస్తుతానికి తమ విడాకుల గురించి ఏ రకమైన అధికారిక ప్రకటన చేయలేదు.