Mana Enadu : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల(Maharashtra elections) నేపథ్యంలో బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసింది. ‘సంకల్ప్ పత్ర’ పేరుతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Amit Shah) దీన్ని విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ.. యువకులు, పేదలు, రైతులు, మహిళల అభివృద్ధి కోసం.. స్కిల్ సెన్సస్, స్టార్టప్‌ల అభివృద్ధి కోసం శివాజీ మహారాజ్ కేంద్రం, ఇంక్యుబేషన్ సెంటర్లు, వడ్డీ లేని రుణాలు అందిస్తామని తెలిపారు. మహారాష్ట్రలో సుస్థిరమైన, విశ్వసనీయమైన పరిపాలన ఉండాలంటే మహాయుతి ప్రభుత్వం అధికారంలో కొనసాగాలని స్పష్టం చేశారు.
బీజేపీ కీలక హామీలు ఇవే..
- ఉద్యోగ కల్పన: యువతకు 25 లక్షల ఉద్యోగాలు
- నైపుణ్య గణన: రాష్ట్రంలో మరిన్ని ఉపాధి అవకాశాలను సృష్టించే లక్ష్యంతో ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల డిమాండ్, సరఫరాను అంచనా వేయడానికి సమగ్ర నైపుణ్య గణన.
- సీనియర్ సిటిజన్లకు పెన్షన్ పెంపు: వృద్ధులకు అందించే నెలవారీ పెన్షన్ రూ.1,500 నుంచి రూ.2,100కు పెంపు
- ఎరువుల జీఎస్టీ వాపసు: రైతులు ఎరువులపై చెల్లించిన జీఎస్టీ(GST)ని తిరిగి చెల్లించి, వారి ఆర్థిక భారాన్ని తగ్గించడం.
- పరిశ్రమల వృద్ధికి వడ్డీ లేని రుణాలు: పారిశ్రామిక అభివృద్ధిని పెంచేందుకు ప్రభుత్వం నుంచి రూ.25 లక్షల వరకు సున్నా వడ్డీ రుణాలు.
- లఖపతి దీదీ పథకం విస్తరణ: ప్రస్తుతం 11 లక్షల మంది మహిళలకు ప్రయోజనం చేకూరుస్తున్న
- “లఖపతి దీదీ” పథకాన్ని 50 లక్షల మంది మహిళలకు విస్తరించి, వారిని ఆర్థికంగా బలోపేతం చేయడం.
- వ్యవసాయ రుణాల మాఫీ: రైతులకు రుణమాఫీ చేసి, వారిపై రుణ భారాన్ని తగ్గించడానికి చర్యలు
- ధరల స్థిరీకరణ: నిత్యావసర వస్తువుల ధరలను స్థిరంగా ఉంచేందుకు చర్యలు
288 మంది శాసనసభ స్థానాలు కలిగిన మహారాష్ట్రలో నవంబరు 20వ తేదీన ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. నవంబరు 23వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. ప్రస్తుతం బీజేపీ, శివసేన, ఎన్సీపీలతో కూడిన మహాయుతి ప్రభుత్వం అధికారంలో ఉండగా.. ఈ ఎన్నికల్లో గెలిచి మళ్లీ అధికారంలోకి రావాలని కాంగ్రెస్, ఎన్సీపీ (ఎస్పీ), శివసేన (యూబీటీ)లతో కూడిన ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ కూటమి ప్రయత్నిస్తోంది.