హైదరాబాద్:
మారుమూల పల్లెలకూ నాణ్యతా ప్రమాణాలను చేరవేసేందుకు, వస్తువుల నాణ్యతపై అవగాహన కల్పించేందుకు భారతీయ ప్రమాణాల సంస్థ (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్) నిర్విరామంగా కృషి చేస్తోందిరా.
రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో పలు అవగాహన కార్యక్రమాలు చేపడుతుండగా పంచాయతీలనూ ఇందులో భాగం చేయనున్నామని, ఇప్పటికే దేశవ్యాప్తంగా దాదాపు 2.4 లక్షల గ్రామ పంచాయతీలను ఈ విషయంలో అప్రమత్తం చేసినట్లు గురువారం బీఐఎస్ విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించింది.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 12వేలకు పైగా గ్రామపంచాయతీల సర్పంచులు, కార్యదర్శులకు అవగాహన కల్పించామని.. త్వరలోనే జిల్లా అధికారుల సమక్షంలో అన్ని గ్రామాల అధ్యక్ష, కార్యదర్శులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు భారతీయ ప్రమాణముల బ్యూరో హైదరాబాద్ శాఖ అధిపతి, సీనియర్ డైరెక్టర్ కే వీ రావు వెల్లడించారు.
ఈనెల 20వ తేదీన నల్గొండ జిల్లాలో తొలివిడత కార్యక్రమం మొదలు కానుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరి వ్యక్తిగత జీవనవిధానంలో, అవసరాల్లో భాగమైన భారతీయ ప్రమాణాలను పూర్తిస్థాయిలో అర్థం చేసుకొని, నాణ్యత విషయంలో పూర్తి అవగాహన కలిగి ఉండేలా, వస్తువల నాణ్యతను నిర్ధారించుకోవడంతో పాటు విలువైన ఆభరణాల నాణ్యత, శుద్ధతను క్షణాల్లో గుర్తించేలా.. ఈ శిక్షణ కార్యక్రమాలు కొనసాగనున్నట్లు తెలిపారు.
గ్రామస్థాయిలో నాణ్యమైన వాతావరణం ఏర్పాటుకు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలు, పలు అభివృద్ధి పనుల్లో భారతీయ ప్రమాణాల పాత్రను పంచాయతీ అధ్యక్ష కార్యదర్శులకు వివరించడంతో పాటు బీఐఎస్ కేర్ యాప్ వినియోగించి క్షణాల్లో వస్తువుల నాణ్యతను ఎలా నిర్ధారించుకోవచ్చునో, బీఐఎస్ అధికారులకు ఎలా ఫిర్యాదు చేయవచ్చునో వంటి అంశాలపై శిక్షణ కొనసాగుతుందని వెల్లడించారు.
ఇప్పటికే హైదరాబాద్ శాఖ పరిధిలో 22 జిల్లాల ఉన్నతాధికారులు, అన్ని విభాగాల అధిపతులకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. విద్యార్థి దశ నుంచే పిల్లల్లో నాణ్యతాప్రమాణాలపై పూర్తి అవగాహన కల్పించేందుకు, మెరుగైన భవిష్యత్తును నిర్మించేందుకు తెలంగాణాలో ఇక్కడి రాష్ట్ర g సహకారంతో దాదాపు వంద పాఠశాలలు, కళాశాలల్లో స్టాండర్డ్స్ క్లబ్స్ ఏర్పాటు చేసి విద్యార్థులకు సైన్స్, స్టాండర్డ్స్ కలిపి అవగాహన కల్పిస్తున్నట్లు కే వీ రావు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ బీఐఎస్ కేర్ యాప్‌ను వినియోగించడం ద్వారా స్వీయ సాధికారత సాధించవచ్చునని స్పష్టం చేశారు.