Delhi : దిల్లీలో ముందస్తు ఎన్నికలు.. ఈసీ క్లారిటీ ఇదే!

ManaEnadu:ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) రాజీనామా ప్రకటనతో దిల్లీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మహారాష్ట్రతో పాటు దిల్లీలోనూ ముందస్తు ఎన్నికలు నిర్వహించాలని ఆప్‌ డిమాండ్‌ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దిల్లీలో ముందస్తు ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదని తెలిపినట్లు తెలిసింది.

మరోవైపు కేజ్రీవాల్‌ రాజీనామా ప్రకటనతో దిల్లీకి నెక్స్ట్ సీఎం ఎవరనేదానిపై ఉత్కంఠ మొదలైంది. రేసులో కేజ్రీవాల్ సతీమణి సునీత, మంత్రులు అతీశి, సౌరభ్ భరద్వాజ్ ఉన్నారు. వీరిలో ఎవరు సీఎం అవుతారనే దానిపై క్లారిటీ లేదు. దీనిపై ఆప్‌ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఈ నేపథ్యంలోనే ముందస్తు ఎన్నికల (Delhi Elections 2024)పై స్పందించిన ఆప్‌ కీలక వ్యాఖ్యలు చేసింది.

ఈ నేపథ్యంలో సీఎం రేసులో ఉన్న దిల్లీ మంత్రి సౌరభ్‌ భరద్వాజ్‌ (Saurabh Bharadwaj) తదుపరి సీఎం ఎవరనే ప్రశ్నకు స్పందిస్తూ కేజ్రీవాల్ రాజీనామా పత్రాన్ని గవర్నర్‌కు అందించనున్నారని తెలిపారు. అది ఆమోదం పొందిన వెంటనే తదుపరి సీఎం ఎవరనే అంశంపై చర్చిస్తామని వెల్లడించారు. పార్టీ ఎమ్మెల్యేలంతా కలిసి ఒక వ్యక్తిని ముఖ్యమంత్రిగా నిర్ణయిస్తామని వివరించారు.

కాగా.. సుప్రీం కోర్టు (Supreme Court) బెయిల్‌ మంజూరు చేయడంతో సీఎం కేజ్రీవాల్‌ ఇటీవల జైలు నుంచి విడుదలైన విషయం తెలిసిందే. బయటకొచ్చిన కొన్ని గంటల్లోనే సీఎం పదవికి రాజీనామా చేస్తానని ఆయన ప్రకటించారు. రెండ్రోజుల్లో రాజీనామా చేస్తానని, ఎన్నికలు జరిగేంతవరకు వేరొకరు ఆ బాధ్యతలు చేపడతారని తెలిపారు. ఆప్‌ (AAP) కష్టాల్లో ఉన్నప్పుడు సాక్షాత్తు భగవంతుడే తమతో ఉండి ముందుకు నడిపించాడని కేజ్రీవాల్‌ అన్నారు. దేవుడిచ్చిన ధైర్యంతో శత్రువులతో పోరాడతామనని వెల్లడించారు. దీంతో యావత్‌ దేశ దృష్టి దిల్లీ రాజకీయాల (Delhi Politics)పై పడింది. తాత్కాలిక సీఎం ఎవరనే అంశంపై ఆప్‌ నేతలు చర్చలకు సిద్ధం అవుతున్నారు.

Share post:

లేటెస్ట్