దిల్లీ లిక్కర్ స్కామ్ (Delhi Excise Policy Case) వ్యవహారానికి సంబంధించి మనీ లాండరింగ్ కేసులో అర్వింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు మరోసారి షాక్ తగిలింది. ఈ వ్యవహారంలో విచారణ జరిపేందుకు ఈడీకి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చింది. ప్రజాప్రతినిధులను విచారించేందుకు ఈడీ ముందస్తు అనుమతి పొందాలని గత నవంబరులో సుప్రీంకోర్టు (Supreme Court) ఆదేశించిన విషయం తెలిసిందే.
కేజ్రీవాల్‌కు మరో షాక్
ఈ నేపథ్యంలో లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్ ను విచారించేందుకు అనుమతి కోరుతూ గత నెల లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు ఈడీ లేఖ రాసింది. సక్సేనా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతోఈ విషయాన్ని ఈడీ కేంద్ర హోంశాఖ (MHA) దృష్టికి తీసుకెళ్లింది. అనంతరం కేజ్రీవాల్‌ను విచారించేందుకు ఈడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరికొన్ని రోజుల్లో దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ పరిణామం చర్చనీయాంశంగా మారింది.
ఈడీ, సీబీఐ కేసులు
దిల్లీ నూతన మద్యం విధానంలో (Liquor scam case) అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై 2024 మార్చి 21వ తేదీన అప్పటి దిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత సీబీఐ కూడా ఈ వ్యవహారంలో ఆయనపై కేసు నమోదు చేసి గతేడాది జూన్‌లో కస్టడీలోకి తీసుకుంది. దీనిపై ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. గత సెప్టెంబరులో బెయిల్ మంజూరైంది.
ఫిబ్రవరిలో ఎన్నికలు
ఈ నేపథ్యంలో జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కేజ్రీవాల్ దిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తన కేబినెట్ లో మంత్రి అతీశీని ఆ తర్వాత సీఎంగా ఎన్నుకున్నారు. ఇక 70 శాసనసభ స్థానాలు ఉన్న దిల్లీకి ఫిబ్రవరి 5వ తేదీన ఒకేవిడతలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఏప్రిల్ 8వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నారు.






