
చాలా కాలంగా సరైన హిట్ లేక వెలవెలబోతున్న బాలీవుడ్ మార్కెట్ కు విక్కీ కౌశల్ (vicky kaushal) నటించిన ‘ఛావా (Chhaava)’ మూవీ కలెక్షన్ల కళ తీసుకువచ్చింది. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించగా.. లక్ష్మణ్ ఉటేకర్ (Laxman Utekar) తెరకెక్కించిన ఈ చిత్రం ప్రస్తుతం హిందీ పరిశ్రమలో బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళ్తోంది. ఛత్రపతి శివాజీ తనయుడు శంభాజీ మహరాజ్ జీవితం ఆధారంగా రూపొందించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల సునామీ సృష్టిస్తోంది. థియేటర్లలో ఈ సినిమా చూస్తున్న ప్రేక్షకులు చాలా ఎమోషనల్ అవుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉన్నాయి.
ఛావాపై రూ.100 కోట్ల దావా!
అయితే ఇంతటి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఛావా సినిమాలో కొన్ని సీన్ల విషయంలో గానోజీ, కన్హోజీ షిర్కే వారసులు అభ్యంతరం తెలిపారు. ఈ మూవీలో తమ పూర్వీకులను తప్పుగా చూపించారని ఆరోపించారు. ఆ సీన్లలో తగిన మార్పులు చేయకపోతే రూ.100 కోట్ల దావా వేస్తామని, న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు. దీంతో ఛావా డైరెక్టర్ లక్ష్మణ్ గానోజీ, కన్హోజీ షిర్కే వారసులకు క్షమాపణలు చెప్పారు. వారి పూర్వీకులను తప్పుగా చూపించే ఉద్దేశం తనకు లేదని.. అందుకే వారికి సంబంధించిన వివరాలు, వారు ఏ ప్రాంతానికి చెందినవారు అనే విషయాలను సినిమాలో తాను ఎక్కడా చూపించలేదని స్పష్టం చేశారు.
ఐయామ్ రియల్లీ సారీ
ఛావా సినిమా విక్కీ కౌశల్, రష్మిక మందన్న (Rashmika Mandanna) ప్రధాన పాత్రల్లో సందడి చేయగా.. అక్షయ్ ఖన్నా ఔరంగజేబు పాత్రలో నటించి మెప్పించారు. అయితే శంభాజీ మహరాజ్ (Chhatrapati Sambhaji Maharaj)కు నమ్మకస్థులైన గానోజీ, కన్హోజీ చివరకు ఔరంగజేబుతో చేతులు కలిపి మహరాజ్ ప్రాణాలకు హాని వాటిల్లేలా చేశారని సినిమాలో చూపించారు. ఈ నేపథ్యంలోనే దీన్ని ఖండించిన వారి వారసులు దర్శకుడు లక్ష్శణ్ ఉటేకర్ కు నోటీసులు పంపారు. ఈ నేపథ్యంలోనే లక్ష్మణ్ ఈ వారసులకు క్షమాపణలు చెప్పారు. ఛావా సినిమాతో వారికి ఏదైనా అసౌకర్యాన్ని కలిగించినట్లయితే హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నానని అన్నారు.