
సాధారణంగా చాలా ఇళ్లల్లో ఆదివారం వస్తే చాలు చికెన్ (Chicken) ఉండాల్సిందే. చాలా మంది రోజూ తినడానికి కూడా ఇష్టపడుతుంటారు. చికెన్ తో రకరకాల వంటలు చేసి తింటుంటారు. అయితే మొన్నటిదాకా దాదాపు రూ.300 వరకు పలికిన కిలో చికెన్ ధరలు ఇప్పుడు భారీగా తగ్గుముఖం పట్టాయి. ఉన్నట్టుండి చికెన్ ధరలు అమాంతం పడిపోయాయి. ప్రస్తుతం కిలో కోడి మాంసం రూ.30లకే విక్రయిస్తున్నారు. ఇంత తక్కువ ధర అని ఆశ్చర్యపోతున్నారా..?
అసలేం జరిగిందంటే..
ఏపీలో ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో కోళ్లకు వైరస్ (Virus in Chicken) సోకి భారీ సంఖ్యలో మరణిస్తున్నాయి. అయితే బర్డ్ ఫ్లూ వల్లే కోళ్లు మృత్యువాత పడుతున్నట్లు పశుసంవర్ధక శాఖ అధికారులు నిర్ధారించారు. దీంతో చాలా మంది కోడి మాంసం తినాలంటే జంకుతున్నారు. ఈ క్రమంలోనే చికెన్ ధరలు భారీగా పడిపోయాయి. మొన్నటి దాక రూ.300 ఉన్న కిలో చికెన్ ధర ప్రస్తుతం రూ.30లు మాత్రమే.
కోళ్లకు బర్డ్ ఫ్లు
కోళ్లకు బర్డ్ ఫ్లూ (Bird Flu in AP) సోకిందన్న వార్త కాస్త రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తి కావడంతో గోదావరి జిల్లాల్లో మాత్రమే కాకుండా ఇతర ప్రాంతాల్లోనూ చికెన్ తినడానికి ప్రజలు భయపడుతున్నారు. మరోవైపు కోళ్లకు HPAI అనే వైరస్ సోకుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు కొన్నిరోజుల పాటు చికెన్ తినకపోవడమే మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.