Mana Enadu: ఒక దేశంలోనేమో పెళ్లి జరగదు.. మరో దేశంలోనేమో కడుపు పండదు. పేరుకు ప్రపంచంలో రెండు అతిపెద్ద దేశాలు. కానీ అక్కడి యువత ఆ దేశాధినేతలకు తలనొప్పి తెప్పిస్తున్నారు. పెళ్లి (Marriage)కి నో అంటూ, పిల్లలంటే నోనోనోనో అంటున్నారు. ఫలితంగా ఆ రెండు దేశాల్లో జననాల రేటు తగ్గుతోంది. వృద్ధుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇంతకూ ఆ దేశాలు ఏంటంటే? అక్కడి యువత పెళ్లంటే ఎందుకు భయపడుతోంది అంటే?
డోంట్ మ్యారీ బీ హ్యాపీ
చైనా, రష్యా (Russia) దేశాలను జననాల రేటు ప్రస్తుతం కంగారు పెడుతోంది. ఆర్థిక సంక్షోభం, నిరుద్యోగం వల్ల చైనాలో, యువకులను బలవంతంగా ఉద్యోగంలోకి దింపడం వల్ల రష్యాలో పెళ్లిళ్ల సంఖ్య తగ్గుతూ వస్తోంది. పెళ్లి తర్వాత భార్యాపిల్లలను పోషించడం కష్టమని, భార్య టార్చర్ భరించలేమంటూ కొందరు యువకులు.. ఒక్కసారి వివాహ బంధం (Married Life)లో చిక్కుకుంటే లైఫ్ స్టైల్ మొత్తం మారిపోవడం నచ్చని అమ్మాయిలు డోంట్ మ్యారీ బీ హ్యాపీ అంటున్నారు.
పెళ్లయిన వారికే ఉద్యోగావకాశాలు
ఇలా అమ్మాయిలు, అబ్బాయిల ధోరణి చూసిన చైనా (China), రష్యా ప్రభుత్వాలు దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించాయి. పెళ్లి చేస్కోండి.. వీలైనంత ఎక్కువ మంది పిల్లల్ని కనండి అంటూ యువతను వేడుకుంటున్నాయి. అలా పెళ్లి చేసుకుని పిల్లలను కంటే ప్రోత్సాహకాలు ఇస్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగావకాశాల్లో పెళ్లయినవారికి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తోంది.
బ్రేక్ టైమ్లో ప్రేమించుకోండి
ఇక రష్యాలో అయితే అక్కడి ప్రభుత్వం తొలి కాన్పుకు ఏకంగా పది లక్షల రూపాయల నజరానా అందిస్తోంది. ఇటీవల ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Putin) లంచ్, కాఫీ బ్రేక్లో ప్రేమించుకోండి, శారీరకంగా కలవండి, పిల్లలను కనండి అంటూ చేసిన ప్రకటన ఆ దేశంలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అద్దం పడుతోంది. చైనా, రష్యా ప్రభుత్వాలు పిల్లల (Children)ను కనాలని యువతను వేడుకుంటూనే సెలబ్రిటీలు, మత పెద్దలతో అవగాహన కార్యక్రమాలు, ప్రచారాలు చేయిస్తున్నాయి.
నెక్స్ట్ మన దేశంలోనూ అంతేనా?
అయితే ఈ పరిస్థితి చైనా, రష్యాలకే పరిమితం అనుకుంటే పొరపాటే. ఇది నెమ్మదిగా భారత్ (India)కూ వ్యాపిస్తోంది. మన దేశంలోనూ పెళ్లంటే చాలా మంది యువత వెనకడుగేస్తున్నారు. పెళ్లయితే లైఫ్ స్టైల్ మార్చుకోవాల్సి వస్తుందని అమ్మాయిలు.. ఫ్రీడం పోతుందని అబ్బాయిలు పెళ్లికి నో చెబుతున్నారు.