
తెలంగాణ రాష్ట్ర సర్కార్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం (Indiramma Housing Scheme) ఇవాళ లాంఛనంగా ప్రారంభమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఈ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. వికారాబాద్, నారాయణపేటలో పర్యటించిన సీఎం.. అప్పకపల్లెలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించారు. అప్పకపల్లిలో బంగలి దేవమ్మ ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ముఖ్యమంత్రి నిర్వహించిన భూమి పూజకు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti), సీతక్క, జూపల్లి కృష్ణారావు, దామోదర రాజనర్సింహ, సిఎం సలహాదారు వెం నరేందర్ రెడ్డి, ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
ఈ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ (CM Revanth Vikarabad Tour) ముందుగా వికారాబాద్ జిల్లాలోని పోలేపల్లి రేణుక ఎల్లమ్మ తల్లిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయానికి చేరుకుని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి పట్టువస్త్రాలు సమర్పించి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అప్పకపల్లెకు చేరుకుని అక్కడ మహిళా సమాఖ్య పెట్రోల్ బంకు ప్రారంభించి అక్కడి మహిళలతో సీఎం, మంత్రులు కాసేపు ముచ్చటించారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని రేవంత్ తెలిపారు.