
గత ప్రభుత్వం లాగ తాను కూడా కక్షపూరిత రాజకీయాలు చేయాలనుకుంటే ఇప్పటికి కొందరు జైల్లో ఉండేవారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. అసెంబ్లీలో బడ్జెట్ (Telangana Assembly Sessions Today) పై చర్చకు సమాధానమిస్తూ ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ప్రతీకార రాజకీయం చేయదలిస్తే కేసీఆర్ కుటుంబమంతా ఇప్పుడు ఊచలు లెక్కబెట్టేదని వ్యాఖ్యానించారు. ఎక్కడికెళ్లినా బీఆర్ఎస్ నేతలను ఎప్పుడు జైల్లోకి వేస్తారని అడుగుతున్నారని.. వాళ్లను కటకటాల వెనక్కి పంపేందుకే తనను ముఖ్యమంత్రిని చేశారని రేవంత్ తెలిపారు.
నా బిడ్డ పెళ్లికి బెయిల్ పై వచ్చాను
“అనుమతి లేకుండా ఎవరైనా డ్రోన్ ఎగరవేస్తే రూ.500 జరిమానా విధిస్తారు. డ్రోన్ ఎగరవేశారని ఒక ఎంపీ మీద కేసు పెట్టి చర్లపల్లి జైలులో వేశారు. మామూలుగా 7 సంవత్సరాల లోపల శిక్ష ఉంటే రిమాండ్‌కు పంపకుండా, బెయిల్ ఇవ్వాలి.. కానీ అధికారాన్ని అడ్డుబెట్టుకొని నన్ను చర్లపల్లి జైలుకు పంపి నక్సలైట్లు, తీవ్రవాదులు ఉండే డిటెన్షన్ సెల్లో వేశారు. రూ.500 జరిమానా వేసే కేసులో నన్ను జైలులో పెట్టి వేధించారు. నా బిడ్డ పెళ్లికి కూడా మధ్యంతర బెయిలుపై వచ్చి వెళ్లాను. 16 రోజులు ఒక్కమనిషిని చూడకుండా నన్ను నిర్బంధించినా.. ఆ కోపాన్ని దిగమింగుకొని రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇవాళ పనిచేస్తున్నాను.” అని రేవంత్ అన్నారు.
కేటీఆర్, కేసీఆర్‌కు జైలులో డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు
“కేటీఆర్ (KTR), కేసీఆర్ (KCR)కు జైలులో డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు కట్టించి ఇస్తానని అన్నాను. కానీ అక్రమ కేసులు పెట్టి వాళ్లను జైలుకు పంపే కక్ష రాజకీయాలు చేసే వ్యక్తిని కాదు. కేటీఆర్, కేసీఆర్‌ను జైలులో వేయాలని చాలామంది మమ్మల్ని అడుగుతున్నారు. అసలు బీఆర్ఎస్ నాయకుల్ని జైలుకు పంపేందుకు నన్ను ప్రజలు ముఖ్యమంత్రిని చేశారు. నేను కూడా అలా ప్రతీకార రాజకీయాలు చేయదలిస్తే.. ఇప్పటికే కొందరు జైలులో ఉండేవారు.” అని రేవంత్ వ్యాఖ్యానించారు.