Deepika Kumari : ఆర్చరీ వరల్డ్ కప్‌ ఫైనల్.. భారత్​కు సిల్వర్ మెడల్

Mana Enadu : ఆర్చరీ వరల్డ్ కప్‌(Archery World Cup Final 2024)లో భారత్​కు సిల్వర్ మెడల్ దక్కింది. ఫైనల్స్‌కు చేరిన భారత స్టార్ ఆర్చర్ దీపికా కుమారి (Deepika Kumari) రజత పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. చైనా ప్లేయర్ లి జియామన్ నుంచి దీపికకు గట్టి దెబ్బ ఎదురైంది. లి ప్రతి రౌండ్‌లో ఆధిపత్యం ప్రదర్శిస్తూ.. 0-6 తేడాతో దీపికాపై విజయం సాధించింది. అలా చైనాకు చెందిన లి జియామన్ గోల్డ్ మెడల్ కైవసం చేసుకుంది.

వరల్డ్ కప్ ఫైనల్​లో భారత్​కు సిల్వర్​

ఇక మూడేళ్ల తర్వాత ఆర్చరీ వరల్డ్ కప్‌ ఫైనల్‌కు వచ్చింది దీపికా. అద్భుత ప్రదర్శన చేసినా సిల్వర్​తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 2022లో కుమార్తె జన్మించడంతో వరల్డ్‌ కప్‌ నుంచి దీపిక వైదొలిగిన విషయం తెలిసిందే. అయితే ఈసారి సెమీస్‌ వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వచ్చినా.. ఫైనల్‌లో మాత్రం తడబాటుకు గురై చైనా (China) క్రీడాకారిణి చేతిలో ఓటమి పాలైంది. ఇప్పటి వరకు దీపిక తొమ్మిదిసార్లు వరల్డ్‌ కప్‌ ఫైనల్‌లో పోటీ పడి ఐదు సిల్వర్ మెడల్స్ .. ఒక కాంస్య పతకం సాధించింది. ఈ క్రీడలో భారత్ తరఫున డోలా బెనర్జీ మాత్రమే బంగారు పతకం సాధించింది.

ఐదుగురి బరిలో దిగినా ఒకే ఒక్క పతకం

ఇక పురుషుల రికర్వ్ విభాగంలో తెలుగు తేజం ధీరజ్‌ బొమ్మదేవరకి ఓటమి ఎదురైంది. దక్షిణ కొరియా (South Korea) ఆర్చర్, పారిస్ కాంస్య పతక విజేత లీ వూ సియోక్‌ చేతిలో 2-4 తేడాతో ధీరజ్ ఓడిపోయాడు. ఐదుగురితో కూడిన భారత బృందం కేవలం ఒకే ఒక్క పతకంతో వెనుదిరగాల్సి వచ్చింది. ముగ్గురు కాంపౌడ్‌, ఇద్దరు రికర్వ్ ఆర్చర్లతో టీమ్‌ ఇండియా బరిలోకి దిగగా.. కేవలం దీపికా కుమారి మాత్రమే సిల్వర్ మెడల్ గెలుచుకుంది.

Share post:

లేటెస్ట్