
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు (Telangana Assembly Session 2025) ఇవాళ మళ్లీ ప్రారంభమయ్యాయి. నేటి సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరానికి వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. శాసనసభలో ఉపముఖ్యమంత్రి, ఆర్థికశాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క పద్దు (Telangana Budget 2025-26)ను ప్రవేశపెట్టగా.. శాసనమండలిలో శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్ను ప్రవేశపెట్టారు.
తెలంగాణ బడ్జెట్ రూ.3,04,965 కోట్లు
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశ పెడుతున్న తొలి పూర్తిస్థాయి బడ్జెట్ ఇదే. మరోవైపు ఆర్థిక మంత్రిగా భట్టి విక్రమార్క ప్రవేశపెడుతున్న మూడో పద్దు ఇది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ రాష్ట్ర వార్షిక పద్దు రూ.3,04,965 కోట్లు అని భట్టి విక్రమార్క తెలిపారు.
వ్యవసాయ శాఖ రూ.24,439 కోట్లు
రెవెన్యూ వ్యయం రూ.2,26,982 కోట్లు ఉండగా.. మూలధన వ్యయం రూ.36,504 కోట్లు అని వెల్లడించారు. ఇక వ్యవసాయ శాఖకు రూ.24,439 కోట్లు, పశుసంవర్ధక రంగానికి రూ.1,674 కోట్లు, పౌరసరఫరాలశాఖకు రూ.5,734 కోట్లు, విద్యా రంగానికి రూ.23,108 కోట్లు కేటాయించినట్లు ప్రకటించారు. ప్రస్తుత ధరల ప్రకారం జీఎస్‌డీపీ రూ.16,12,579 కోట్లు ఉందని చెప్పారు. గతేడాదితో పోలిస్తే వృద్ధిరేటు 10.1 శాతం నమోదయినట్లు ప్రకటించారు.
జీఎస్‌డీపీ వృద్ధిరేటు జీడీపీ కంటే ఎక్కువ
జీఎస్‌డీపీ వృద్ధిరేటు జీడీపీ వృద్ధిరేటు కంటే ఎక్కువగా ఉందని.. జీఎస్‌డీపీ వృద్ధి రేటు 10.1 శాతం, జీడీపీ వృద్ధి రేటు 9.9 శాతం అని భట్టి విక్రమార్క తెలిపారు. దేశ జీడీపీ రూ.3,31,03,215 కోట్లు ఉందని.. 2024-25 ఏడాది తలసరి ఆదాయం రూ.3,79,751 ఉందని వెల్లడించారు. రాష్ట్ర తలసరి ఆదాయ వృద్ధిరేటు 9.6 శాతం,, దేశ తలసరి ఆదాయం రూ.2,05,579 కోట్లు ఉందని పేర్కొన్నారు. దేశ తలసరి ఆదాయ వృద్ధిరేటు 8.8 శాతం ఉంటే.. దేశ తలసరి ఆదాయానికి రాష్ట్ర తలసరి ఆదాయం 1.8 రెట్లు ఉందని వివరించారు.
శాఖలవారిగా కేటాయింపులు
- 2025-26 రాష్ట్ర బడ్జెట్ రూ.3,04,965 కోట్లు
- రెవెన్యూ వ్యయం – రూ.2,26,982 కోట్లు
- మూలధన వ్యయం – రూ.36,504 కోట్లు
- వ్యవసాయశాఖ – రూ.24,439 కోట్లు
- పశుసంవర్ధకం – రూ.1,674 కోట్లు
- పౌరసరఫరాలశాఖ – రూ.5,734 కోట్లు
- విద్యా రంగం – రూ.23,108 కోట్లు