పాకిస్థాన్ (Pakistan)లో భూకంపం సంభవించింది. అయితే ఇదే అదునుగా ఓ జైలు నుంచి ఏకంగా 200 మందికిపైగా ఖైదీలు పరారయ్యారు. కరాచీలోని బఛా ప్రాంతంలో సోమవారం మూడుసార్లు స్వల్పంగా భూమి కంపించింది. కాగా ఆ ప్రాంతంలో ఉన్న ఓ పాత జైలు గోడలు కుప్పకూలాయి. ప్రమాదం పొంచి ఉండడంతో వెయ్యి మందికి పైగా ఖైదీలను వారి బ్యారక్‌ల నుంచి వేరేచోటుకి అధికారులు తరలించే ఏర్పాట్లు చేశారు.
ఆయుధాలు లాక్కుని వారిపై కాల్పులు
అధికారుల వద్ద ఉన్న ఆయుధాలు లాక్కుని కాల్పులు జరిపి..
అయితే ఖైదీలను తరలిస్తుండగా ఇదే అందునుగా భావించిన కొందరు అధికారుల కళ్లుగప్పి తప్పించుకున్నారు. కొందరు ఏకంగా అధికారుల వద్ద ఉన్న ఆయుధాలు లాక్కుని వారిపై కాల్పులు జరిపారు. దీంతో నలుగురు అధికారులు గాయపడ్డారు. ప్రతిగా అధికారులు కూడా కాల్పులు జరపడంతో ఓ ఖైదీ మృతిచెందాడు. గోడలు కూలిపోవడంతో సునాయాసంగా పారిపోయారని, మొత్తం 216 మంది ఖైదీలు తప్పించుకున్నారని అధికారులు వెల్లడించారు. పారిపోయిన వారిలో డ్రగ్స్ నేరస్థులు, మానసికంగా సరిగా లేనివారే ఎక్కువగా ఉన్నారని తెలిపారు.
78 మందిని పట్టుకున్నట్లు వెల్లడి
ఖైదీల పరారీ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. తిరిగి పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. జాతీయ రహదారితో సహా పలు మార్గాలను మూసివేశారు. వారిని పట్టుకునేందుకు స్థానికుల సాయం తీసుకుంటున్నట్లు ఓ అధికారి తెలిపారు. తప్పించుకొని పారిపోయిన వారిలో ఇప్పటివరకు మొత్తం 78 మందిని పట్టుకున్నట్లు పేర్కొన్నారు.






