మన ఈనాడు: విశాఖపట్నం రైల్వేస్టేషనుతోపాటు రైళ్లలో కొనుగోలు చేసిన బిర్యానీ తిని తొమ్మిది మంది అస్వస్థతకు గురయ్యారు. వాళ్లను హుటాహుటిన రాజమహేంద్రవరం జీజీహెచ్ ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాలతో బయటపడిన సంఘటన చోటుచేసుకుంది.
పట్నా-ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో పట్నా నుంచి తమిళనాడులోని సేలంకు వెళ్తున్న 15 మంది విశాఖపట్నం రైల్వేస్టేషనులో బిర్యానీలు కొన్నారు. అవి తిన్న అరగంట తర్వాత వారిలో ఐదుగురికి వాంతులు, విరేచనాలు మొదలయ్యా యి.మరో నలుగురి పరిస్థితి విషమంగా మారింది. దీంతో రైలు మదద్ యాప్‌లో ఫిర్యాదుచేశారు.
సాయంత్రం 6 గంటలకు రాజమండ్రి రైల్వేస్టేషన్‌లో సిద్ధంగా ఉన్న రైల్వే, పోలీసు సిబ్బంది ఆ ఐదుగురిని 108లో రాజమహేంద్రవరం జీజీహెచ్‌కి తరలించారు. అలాగే, దిబ్రూగఢ్-కన్యాకుమారి ఎక్స్‌ప్రె్‌స(రైలు నెం.22504)లో అసోంలోని హోజ్జయ్ నుంచి కేరళలోని పాలక్కడ్‌కు వెళ్తున్న ఏడుగురు విశాఖపట్నం రైల్వేస్టేషన్ దాటిన తర్వాత రైలులో ఎగ్ బిర్యానీలు కొనుక్కొని తిన్నారు. కాసేపటికి వారిలోనూ నలుగురుకి వాంతులు పట్టుకున్నాయి.
కడుపునొప్పితో మెలికలు తిరిగిపోయారు. రైల్‌మదద్ యాప్‌లో ఫిర్యాదు చేయగా, అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో రైలు రాజమండ్రి చేసుకోగానే రైల్వే, పోలీసు సిబ్బంది వాళ్లను 108లో జీజీహెచ్‌కి తరలించారు. చికిత్స అనంతరం ఆదివారం ఉదయం వారంతా మరో రైల్లో వెళ్లిపోయారు. విషతుల్యమైన ఆహారం తినడం వల్ల అస్వస్థతకు గురయ్యారని వైద్యులు చెప్పినట్లు సమాచారం. రైల్వే ఆహారం నాణ్యత లోపంపై ప్రజలు మండిపడుతున్నారు. ప్రాణాలకు ముప్పు వాటిల్లి ఉంటే ఎవరు బాధ్యులని ప్రశ్నిస్తున్నారు.