మహారాష్ట్ర(Maharastra)లో సీఎం(CM) ఎవరనేదానిపై ఇంకా సస్పెన్స్ వీడటం లేదు. అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్స్(Assembly Election Results) విడుదలై వారం రోజులు గడుస్తున్నా సీఎం పదవిపై మహాయుతి కూటమి(Mahayuti alliance)లో లెక్కలు తేలడం లేదు. మరోవైపు గురువారం సాయంత్రం అమిత్ షా(Amit Shah)ను ఆపార్టీ నేతలు ఫడ్నవీస్, శివసేన నేత షిండే, NCP అజిత్ పవార్ కలిశారు. అయితే ముంబైలో జరగాల్సిన మహాయితి మీటింగ్ ఆకస్మికంగా రద్దు కావడం సంచలనంగా మారింది. దీంతో ఏక్‌నాథ్ షిండే(Eknath Shinde) అనూహ్యంగా స్వగ్రామం సతారా(Satara)కు వెళ్లిపోయారు. అత్యవసరంగా షిండే సతారాకు వెళ్లడంతో ఆయన అసంతృప్తిగా ఉన్నారన్న న్యూస్ చక్కర్లు కొడుతోంది. ప్రభుత్వ ఏర్పాటుపై ఆయన తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు వార్తలు సైతం వినిపిస్తున్నాయి.
పదవుల పంపకాల్లో కుదరని ఏకాభిప్రాయం
అయితే CM, డిప్యూటీ సీఎం పదవులపై ఏకాభిప్రాయం వచ్చినా మంత్రి పదవుల విషయంలో మహాయుతి కూటమి(Mahayuti alliance)లో బేధాభిప్రాయాలు తలెత్తినట్లు తెలుస్తోంది. డిప్యూటీ సీఎంగా ఉండేందుకు షిండే కాస్త విముఖత చూపుతున్నట్లు సమాచారం.CMగా ఫడ్నవీస్(Fadnavis) పేరు ఖరారు కాగా.. అత్యంత కీలకమైన హోం శాఖను తన దగ్గరే ఉంచుకోవాలని BJP భావిస్తున్నట్లు తెలుస్తోంది. అజిత్ పవార్ NCPకి ఫైనాన్స్ శాఖను ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు షిండే వర్గానికి అర్బన్ డెవలప్‌మెంట్, పబ్లిక్ వర్క్స్ శాఖను ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. BJPకి 22 మంత్రి పదవులు, శివసేనకు 12, NCPకి 9 కేబినెట్ బెర్తులు దక్కనున్నట్లు సమాచారం.
మరికొన్ని రోజులు పట్టే అవకాశం?
ఈనేపథ్యంలోనే CM పేరు ప్రకటన మరికొన్ని రోజులు పట్టే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది. డిసెంబర్ 2న కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఉంటుందని తెలుస్తోంది. వాస్తవానికి షిండేకే CM పదవి ఇవ్వాలని తొలుత BJP భావించింది. కానీ అజిత్ పవార్ ఎదురు తిరగడంతో సీన్ రివర్స్ అయ్యింది. షిండేకు సీఎం పదవి ఇస్తే తాను ఊరుకునేది లేదని తేల్చిచెప్పడంతో.. ఫడ్నవీస్‌ను సీఎం చేయాలని బీజేపీ హైకమాండ్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. మరి “మహా” సీఎం ఉత్కంఠ ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతోందో వేచిచూడాలి.