Mana Enadu : బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR)ను విమర్శించే క్రమంలో టాలీవుడ్ నటుడు నాగచైతన్య, స్టార్ హీరోయిన్ సమంత విడాకులు, అక్కినేని నాగార్జున పేర్లను ప్రస్తావిస్తూ మంత్రి కొండా సురేఖ (Konda Surekha) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ నేపథ్యంలో మంత్రి వ్యాఖ్యలను టాలీవుడ్ ముక్తకంఠంతో ఖండిస్తోంది. సినిమా వాళ్లపై రాజకీయ నేతల మాటల దాడులను సహించబోమని మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తేల్చి చెప్పారు. కొండా సురేఖ కామెంట్స్ పై టాలీవుడ్ ప్రముఖులు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో “FilmIndustryWillNotTolerate” అనే హ్యాష్ టాగ్ ట్రెండ్ అవుతోంది.
సినిమా వాళ్లపై మాటల సహించబోం : మెగాస్టార్ చిరంజీవి
‘‘గౌరవనీయులైన మహిళా మంత్రి చేసిన అవమానకర వ్యాఖ్యలు చూసి నేను చాలా బాధపడ్డాను. త్వరితగతిన వార్తల్లో నిలిచేందుకు సెలబ్రిటీలు.. సినీ కుటుంబానికి చెందిన వ్యక్తులను సాఫ్ట్ టార్గెట్ చేసుకోవడం సిగ్గు చేటు. చిత్ర పరిశ్రమకు చెందిన సభ్యులపై ఇలాంటి మాటల దాడులను మేమంతా ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నాం. రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తులు, మరీ ముఖ్యంగా మహిళలపై ఇలాంటి ఆరోపణలు చేసి దిగజారవద్దు. సమాజాభివృద్ధి కోసం మేము మా నాయకులను ఎన్నుకుంటాం. ఇలాంటి వ్యాఖ్యలు చేసి వారు తమ స్థాయిని తగ్గించుకోకూడదు. రాజకీయ నాయకులు, గౌరవప్రదమైన స్థానాల్లో ఉన్నవారు ఎంతోమందికి స్ఫూర్తిగా నిలవాలి’’ అని చిరంజీవి పేర్కొన్నారు.
ఇలాంటి వ్యాఖ్యలు తేలిగ్గా తీసుకోం : నిర్మాత ఎస్‌కేఎన్
‘‘ఓ ప్రజాప్రతినిధి, మంత్రి అయిన కొండా సురేఖ గారు.. ఇలా వ్యక్తిగత జీవితాలను రాజకీయ వివాదంలోకి లాగడం గీత దాటడమే. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న నాయకులు.. ఇతరులపై గౌరవంగా వ్యవహరించాలి. ముఖ్యంగా సినీ పరిశ్రమ (Film Industry)కు చెందిన వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని నిరాధార, నిర్లక్ష్యపూరిత వ్యాఖ్యలు చేస్తే తేలిగ్గా తీసుకోం. ఇలాంటి ఆరోపణలను మేం ఎన్నటికీ సహించబోం’’
బాధ్యతాయుతంగా వ్యవహరించాలి : అల్లు అర్జున్
‘‘సినీ ప్రముఖులు, వారి కుటుంబాలపై చేసిన నిరాధారమైన, కించపరిచే వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ ప్రవర్తన చాలా అగౌరవంగా, మన తెలుగు సంస్కృతి విలువలకు విరుద్ధంగా ఉంది. ఇలాంటి బాధ్యతారహితమైన చర్యలను సాధారణమైనవిగా అంగీకరించకూడదు. ఇతరుల వ్యక్తిగత గోప్యత, మరీ ముఖ్యంగా మహిళలను గౌరవించేలా పార్టీలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరుతున్నా. మనందరం కలిసి సమాజంలో గౌరవం, మర్యాద పెంపొందించాలి’’
ప్రతిసారి మాపై కామెంట్స్ .. చాలా కోపమొస్తోంది : మంచు లక్ష్మి
‘‘ఇది చాలా నిరుత్సాహకరం. ప్రతిసారీ రాజకీయ నాయకులు సినీ పరిశ్రమకు చెందినవారిపై ఇలాంటి నిందలు వేయడం కోపం తెప్పిస్తోంది. రాష్ట్రంలో ఏదైనా భయంకరమైన సంఘటన జరిగినప్పుడు రాజకీయ నాయకులు వారి అజెండాల కోసం సినీ ప్రముఖుల నుంచి మద్దతు కోరుతారు. ఇది ఎలా న్యాయం అవుతుంది? ఇప్పుడు మేం ఎందుకు మౌనంగా ఉండాలి? ఓ మహిళ నుంచి ఇలాంటి ఆరోపణలు మరింత ఎక్కువ బాధ కలిగిస్తున్నాయి. ప్రజలకు వినోదాన్ని అందించేందుకు తమ జీవితాలను అంకితం చేసే వారిని గౌరవించండి. అంతేగానీ, ఇలా రాజకీయాల్లోకి లాగొద్దు. ఇది చాలా అన్యాయం’’
మీ వ్యాఖ్యలు మీ బుద్ధిని తెలియజేస్తున్నాయి : హీరో సుధీర్ బాబు
‘‘మంత్రి కొండా సురేఖ గారు.. మీ అమర్యాదకర, స్త్రీ ద్వేషపూరిత వ్యాఖ్యలు భయంకరంగా ఉన్నాయి. సినీ ప్రముఖులను రాజకీయ పావులుగా వాడుకోవడం మీ బుద్ధిని తెలియజేస్తోంది. ఇలాంటి వ్యూహాలకు మా మధ్య సోదరభావం బెదిరిపోదు.. బెదిరింపులకు గురికాదు. మీరు కేవలం మహిళలను అవమానించడమే కాదు.. తెలంగాణకు గర్వకారణమైన మొత్తం సినీ పరిశ్రమను అగౌరపర్చారు. ఇలాంటి విషయాల నుంచి ప్రజలను పాలించడం వైపు దృష్టి మరల్చండి. మీ గౌరవం ఇప్పటికే తగ్గిపోయింది. దానిని మరింత దిగజార్చద్దు’’
నేను షాకయ్యా : రాం గోపాల్ వర్మ
‘‘నాగార్జున కుటుంబాన్ని అత్యంత దారుణంగా అవమానపరిచిన కొండా సురేఖ కామెంట్లకు నేను షాక్ అయ్యా. ఆమె తన రాజకీయ ప్రత్యర్థి మీద పగ తీర్చుకునే క్రమంలో అత్యంత గౌరవప్రదమైన నాగార్జున కుటుంబాన్ని లాగడం ఏ మాత్రం సహించకూడదు’’