
విజయవాడలో భారీ అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. సితార సెంటర్‌లో విద్యాధరపురం గ్రౌండ్‌లో కశ్మీర్ జలకన్య ఎగ్జిబిషన్‌లో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. సిబ్బంది పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా వారు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
భారీగా ఎగిసిపడ్డ మంటలు
మొత్తం మూడు అగ్నిమాపక శకటాలు మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నాయి. గ్యాస్ సిలిండర్ పేలడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. బుధవారం మధ్యాహ్నం ఎగ్జిబిషన్‌లోని ఒక స్టాళ్లలో వంట చేస్తుండగా ఒక్కసారిగా సిలిండర్ పేలినట్లు అధికారులు తెలిపారు. దీంతో మంటలు వ్యాపించి పక్కనున్న స్టాళ్లకు అంటుకున్నాయని వెల్లడించారు.
స్టాళ్లు దగ్ధం
కశ్మీర్ జలకన్య పేరుతో గత కొన్ని రోజులుగా విజయవాడలో ఎగ్జిబిషన్‌లో కొనసాగుతుంది. ఈ ప్రమాదంలో స్టాళ్లు.. ఫర్నిచర్ దహనమయ్యాయని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ప్రాణనష్టం జరిగిందా లేదా తెలియాల్సి ఉంది. భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు మాత్రం తెలుస్తోంది. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.