
YSRCP నేత, గన్నవరం మాజీ MLA వల్లభనేని వంశీ(Vallabhaneni Vamsi)ని ఏపీ పోలీసులు హైదరాబాద్‌లో అరెస్టు(Arrest) చేశారు. గురువారం ఉదయం రాయదుర్గం పోలీసుల సహకారంతో వంశీని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయనను హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలిస్తున్నారు. గతంలో గన్నవరం TDP పార్టీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీ సహా మొత్తం 88 మందిపై పోలీసులు కేసు(Police case) పెట్టారు. పార్టీ కార్యాలయంలో పని చేస్తున్న సత్యవర్ధన్(Satyavardhan) ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ కేసులో ఇప్పటికే నిందితుడిగా ఉన్న వంశీ.. బెయిల్(Bail) కోసం కోర్టును ఆశ్రయించారు. ఈ నెల 20న వంశీ దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్(Bail Petition)పై తీర్పు రానుంది. ఈ నేపథ్యంలో ఆయనను అరెస్టు చేయడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు కోర్టు తీర్పు రావాల్సి ఉండగా తనను ఎందుకు అరెస్టు చేస్తున్నారంటూ ఏపీ పోలీసుల(Ap Police)తో వంశీ వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. అయితే ఈ కేసుకు సంబంధించి సత్యవర్ధన్‌ను వంశీ, అతని అనుచరులు కిడ్నాప్ చేసి బెదిరించి ఫిర్యాదు వెనక్కు తీసుకొనేలా చేశారని పోలీసులు అంటున్నారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.