భారత్(India)లో యాపిల్ కంపెనీ(Apple Company) తన ఐఫోన్(iPhone) ఉత్పత్తిని విస్తరించే దిశగా మరో ముందడుగు వేసింది. తైవాన్‌కు చెందిన ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ఫాక్స్‌కాన్(Foxconn) బెంగళూరులోని దేవనహళ్లిలో తన కొత్త ఫ్యాక్టరీలో ఐఫోన్ 17 ఉత్పత్తిని ప్రారంభించింది. ఈ యూనిట్, ఫాక్స్‌కాన్‌కు చెందిన చైనా బయట రెండవ అతిపెద్ద ఐఫోన్ తయారీ కేంద్రం(iPhone Manufacturing Center)గా నిలిచింది. దాదాపు 2.8 బిలియన్ డాలర్ల (సుమారు 25,000 కోట్ల రూపాయలు) పెట్టుబడితో ఈ ఫ్యాక్టరీ నిర్మాణం జరిగింది. ఈ కర్మాగారం చెన్నైలోని ఫాక్స్‌కాన్ యూనిట్‌తో కలిసి ఐఫోన్ 17 ఉత్పత్తిని చేపట్టనుంది.
60 మిలియన్ ఐఫోన్‌ల ఉత్పత్తే లక్ష్యం
ఈ కొత్త యూనిట్ ప్రారంభం, భారత్‌ను యాపిల్ గ్లోబల్ సప్లై చైన్(Apple’s global supply chain)లో కీలక హబ్‌గా మార్చే లక్ష్యంతో ఏర్పడింది. 2025లో యాపిల్ 60 మిలియన్ ఐఫోన్‌ల ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది 2024-25లో 35-40 మిలియన్ యూనిట్ల నుంచి గణనీయమైన పెరుగుదల. గత ఆర్థిక సంవత్సరంలో భారత్‌లో యాపిల్ 22 బిలియన్ డాలర్ల విలువైన ఐఫోన్‌లను అసెంబుల్ చేసింది. ఇది 60% వృద్ధిని సూచిస్తుంది. యాపిల్ సీఈఓ టిమ్ కుక్(Apple CEO Tim Cook), జూలై 31, 2025న ఆర్థిక ఫలితాల ప్రకటనలో జూన్ 2025లో అమెరికాలో విక్రయించిన ఐఫోన్‌లలో ఎక్కువ భాగం భారత్‌లో తయారైనవని పేర్కొన్నారు.
సెప్టెంబరులో మార్కెట్లోకి విడుదలకు ప్లాన్
ఈ యూనిట్ ప్రారంభంతో, భారత్‌లో ఐఫోన్ ఎగుమతులు మరింత పెరగనున్నాయి. అంతేకాకుండా, భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్(Indian smartphone market)లో యాపిల్ వాటా 7.5%కి చేరింది. చెన్నై సమీపంలోని శ్రీపెరంబుదూర్ వద్ద ఏర్పాటు చేసిన యూనిట్‌లోనూ ఫాక్స్‌కాన్ ఐఫోన్ 17ను అసెంబ్లింగ్ చేస్తోంది. ఐఫోన్ 17ను యాపిల్ సెప్టెంబరులో మార్కెట్లోకి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.






