తెలంగాణలో గృహజ్యోతి (Gruha Jyothi) లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం సర్దుబాటు షాక్ ఇస్తోంది. కొందరికి 29 రోజులకు, కొందరికి 32 రోజులు.. వెనకా ముందు బిల్లింగ్ జారీ చేస్తున్నారు. అయితే ఆలస్యంగా బిల్లు తీయడం వల్ల స్లాబ్ మారి కొందరికి అధిక బిల్లులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో గృహజ్యోతి నిబంధనల ప్రకారం నిర్ణీత 200 యూనిట్లు దాటుతుండటంతో బిల్లు మోత మోగుతోంది.
ఉదాహరణకు
బోరబండలో ఉంటున్న సురేశ్ కు ఈనెల 3న జనవరి నెల గృహజ్యోతి బిల్లు రీడింగ్ తీశారు. అయితే 30 రోజులకు 196 యూనిట్లు వాడినట్లు ఉంది. ఆ నెలలో 31 రోజులకు సర్దుబాటు చేయడంతో సగటు నెల యూనిట్లు 203 యూనిట్లయ్యాయి. గృహజ్యోతి పథకంలో 200 యానిట్ల వరకే సున్నా బిల్లు (Zero Electricity Bill issues) వర్తిస్తుందన్న విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం సురేశ్ 200 యూనిట్ల కరెంట్ కంటే ఎక్కువ వాడటంతో ఆ వ్యక్తికి రూ.1140 బిల్లు వచ్చింది.
అర్జీలు పెట్టుకోవచ్చు
ఇలా చాలా మంది లబ్ధిదారులు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. దీంతో వారు అధికారులపై తీవ్రంగా మండిపడుతున్నారు. సరిగ్గా నెలకు బిల్లు ఇవ్వకపోవడం విద్యుత్తు సంస్థ సేవా లోపమైతే, ఆ భారం తామేందుకు మోయాలని ప్రశ్నిస్తున్నారు. నెల ముగిసిన తరువాతే ఇస్తే లెక్కలు సరిగా ఉంటాయని అంటున్నారు. ఇక ఇదే విషయమై ఈ నెల 28 వరకు వినియోగదారుల నుంచి ఈఆర్‌సీ అభ్యంతరాలను ఆహ్వానిస్తోంది. వినియోగదారులు వెబ్‌సైట్‌లో లేదా నేరుగా టీజీఎస్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో అర్జీ పెట్టుకుంటే సమస్య పరిష్కరిస్తారు.







