రంభ.. 1990ల్లో స్టార్ హీరోల సరసన నటించి మెప్పించి స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుంది. అయితే, ఆమె సినిమాలకు దూరమై 15 ఏళ్లు అయిపోయాయి. ప్రస్తుతం ఓ టీవీ రియాలిటీ షోకు జడ్జిగా చేస్తోంది. కాగా తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రంభ మాట్లాడుతూ.. పలు ఆసక్తికర విషయాలు షేర్ చేసుకుంది. వివాహం అనంతరం కెనడాలో స్థిరపడినట్లు ఆమె చెప్పుకొచ్చింది. ‘నా పిల్లలకు ఒక వయసు వచ్చేవరకూ తల్లిగా పూర్తి బాధ్యత తీసుకున్నాను. వారిని దగ్గరుండి చూసుకున్నాను. ఇప్పుడు మా బాబుకు 6 ఏళ్లు. కుమార్తెలకు 14, 10 ఏళ్లు వచ్చాయి. వాళ్ల కోసమే నేను ఇన్నేళ్లు సినిమాలకు దూరమయ్యాను’ అని రంభ చెప్పింది.
ఆ విషయం నా భర్తకు తెలుసు
అలాగే.. ‘నాకు సినిమాలపై ఉన్న ఆసక్తి నా భర్తకు తెలుసు. ఆయన ప్రోత్సాహంతోనే ప్రస్తుతం జడ్జిగా వ్యవహరించేందుకు అంగీకరించాను. ఈ షో కోసం నన్ను సంప్రదించినప్పుడు ఇందులో భాగం కావాలా, వద్దా అని ఆలోచించాను. నా కుటుంబం నన్ను పోత్సహించింది. నాకు సినిమాలపై మరోసారి ఆసక్తి కలిగింది. 15 ఏళ్లు దూరమైనప్పటికీ నటన నా రక్తంలోనే ఉంది. నాతో పాటు ఇండస్ట్రీకి వచ్చిన ఎంతోమంది నేటికీ నటిస్తూనే ఉన్నారు. అందుకే నేను కూడా మరోసారి వెండితెరపై కనిపించాలని నిర్ణయించుకున్నాను’ అంటూ రంభ తెలిపింది.
ఈ సినిమాలు సూపర్ హిట్
కాగా రంభ నటించిన సినిమాల్లో అల్లుడా మజాకా, బావగారూ బాగున్నారా, బొంబాయి ప్రియుడు, ముద్దుల ప్రియుడు, యమదొంగ, మెకానిక్ మావయ్య, మూడు ముక్కలాట, పెళ్లిగోల, ఒక్కడు చాలు, మృగరాజు, అరుణాచలం తదితర సినిమాల్లో ఆమె తన నటనతో ఆకట్టుకుంది. కాగా మరోసారి టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించడంతో ఆమెకు ఆఫర్లు క్యూ కట్టే అవకాశం ఉంది.






