
తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు (MLC Elections 2025) నగారా మోగిన విషయం తెలిసిందే. తెలంగాణలో మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ పట్టభద్రుల స్థానానికి, ఏపీలో ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ఉమ్మడి తూ.గో., ప.గో జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఈ నెల 27వ తేదీ పోలింగ్ నిర్వహించనున్నారు. మార్చి 3వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి.
ఈ ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో ఇప్పటికే వేలాది మంది పట్టభద్రులు ఓటు (Graduate MLC Elections 2025) నమోదు చేసుకున్నారు. ఇటీవల అధికారులు ఓటర్ల జాబితాను కూడా రిలీజ్ చేశారు. పట్టభద్రుల ఓటర్ల జాబితా పార్లమెంట్, అసెంబ్లీ ఓటర్ల జాబితాతో ఏ మాత్రం సంబంధం లేకుండా ఉంటుందన్న విషయం తెలిసిందే. మరి ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మీ ఓటు ఉందా లేదా? ఏ పోలింగ్ కేంద్రంలో ఓటు వేయాలి? వంటి విషయాలు ఇలా తెలుసుకోండి.
ఏపీ, తెలంగాణ ఎన్నికల వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. ఉదాహరణకు ఏపీ వెబ్ సైట్.. https:///ceoandhra.nic.in ఓపెన్ చేసి.. కుడివైపున ‘ఎమ్మెల్సీ రిజిస్ట్రేషన్ 2024’ క్లిక్ చేయగా నాలుగు ఆప్షన్లు కనిపిస్తాయి. ‘సెర్చ్ యువర్ నేమ్’ (Search your Name) క్లిక్ చేస్తే.. పట్టభద్రులు, టీచర్స్ ఎమ్మెల్సీలకు సంబంధించిన వివరాలతో పేజీ ఓపెన్ అవుతుంది. కృష్ణా, గుంటూరు, తూ.గో., ప.గో. జిల్లాలకు చెందిన వారైతే ఆ జిల్లాలకు చెందిన ఆప్షన్ ఎంచుకోవాలి.
అనంతరం ఎమ్మెల్సీ ఓటు (MLC Vote 2025) నమోదు దరఖాస్తు చేసిన సమయంలో ఇచ్చిన ఐడీ నంబర్ ద్వారా ఓటు వివరాలు తెలుసుకోవచ్చు. లేదా మీ పేరు లేదా ఇంటి నంబరుతో ఓటు ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు. ఇంటి నంబరును ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే ఆ నంబరుతో ఎన్ని ఓట్లు ఉన్నాయి.. దరఖాస్తు నంబరుతో పాటు ఓటరు పేరు, వయసు, పోలింగ్ బూత్ నంబరు.. ఓటు సీరియల్ నంబరుతో పాటు ఏ పోలింగ్ కేంద్రంలో ఏ గదిలో మీరు ఓటు వేయాలో కూడా వివరాలు తెలుసుకోవచ్చు.