Mana Enadu : సురేశ్ హైదరాబాద్ లోని ఓ ప్రముఖ ఐటీ కంపెనీలో ప్రాజెక్టు మేనేజర్ గా పనిచేస్తున్నాడు. ఓరోజు ఆఫీసు నుంచి తిరిగి వచ్చిన తర్వాత తెలియని ఓ నంబరు నుంచి ఫోన్ వచ్చింది. నంబరు కాస్త డిఫరెంటుగా ఉందని అతడు ఫోన్ లిఫ్టు చేయలేదు. గంట తర్వాత మళ్లీ అలాంటి ఓ విచిత్రమైన ఫోన్ నంబరు నుంచే కాల్ వచ్చింది. ఈసారి అతను ఫోన్ లిఫ్టు చేశాడు. కానీ అవతలి వైపు నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు.
మరుసటి రోజు అతడి బ్యాంకు ఖాతా నుంచి లక్ష రూపాయలు మాయం. ఏమైందని బ్యాంకుకు వెళ్లి ఆరా తీస్తే ఎవరో అతడి ఖాతా నుంచి డబ్బు ట్రాన్స్ ఫర్ చేసినట్లు తెలిసింది. ఎవరని ఆరా తీస్తే.. ఆ వివరాలు తెలియ రాలేదు. చివరకు పోలీసులను ఆశ్రయిస్తే అతడి ఫోన్ హ్యాకింగ్(Phone Hacking)కు గురై.. సైబర్ కేటుగాళ్ల చేతిలోకి అతడి బ్యాంకు ఖాతా వివరాలు వెళ్లాయని తెలిపారు.
ఇలాంటోళ్లతో బీ కేర్ ఫుల్
ఇలాంటి పరిస్థితి కేవలం సురేశ్ కే కాదు దేశవ్యాప్తంగా రోజు కొన్ని కోట్ల మందికి ఎదురవుతోంది. సైబర్ కేటుగాళ్లు అమాయకులకు వల వేస్తూ వారి బ్యాంకు వివరాలు లాగేస్తూ లక్షల రూపాయల వారి కష్టార్జితాన్ని కాజేస్తున్నారు. వారిని పట్టుకోవడం పోలీసులకు పెను సవాలుగా మారుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు(Hyderabad Cyber Crime Police) ఓ కీలక ప్రకటన విడుదల చేశారు. అపరిచితుల నుంచి వచ్చే ఫోన్‌లపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
ఈ నంబర్లతో ఫోన్ వస్తే లిఫ్టు చేయొద్దు
ముఖ్యంగా +94777 455913, +37127913091, +56322553736, +37052529259, +255901130460 ఇలాంటి నంబరుతో ఫోన్ వస్తే లిఫ్టు చేయొద్దని అధికారులు సూచించారు. ప్రధానంగా +371 (లాత్వియా), +375 (బెలారస్), +381 (సెర్బియా), +563 (లోవా), +370 (లిథువేనియా), +255 (టాంజానియా) వంటి కోడ్‌లతో మొదలయ్యే నంబరుతో వచ్చే ఫోన్ ను లిఫ్టు చేస్తే.. ఆ తర్వాత మీ మొబైల్ హ్యాకింగ్(Mobile Hacking)కు గురవుతుందని చెప్పారు. ఇక తిరిగి ఫోన్ చేస్తే కాంటాక్ట్ జాబితాతోపాటు బ్యాంకు, క్రెడిట్ కార్డు ఇతర వివరాలు మూడు సెకన్లలో కాపీ చేసుకునే ప్రమాదం ఉందని తెలిపారు.
ఈ నంబర్లు అస్సలు నొక్కొద్దు
ముఖ్యంగా 90 లేదా 09 నంబర్లను నొక్కాలని ఎవరైనా సూచిస్తే మాత్రం అస్సలు అలా చేయకూడదని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరించారు. అలా చేసినట్లయితే మీ సిమ్ కార్డును యాక్సెస్ చేసుకునే ప్రమాదం ఉందని తెలిపారు. సిమ్ కార్డు యాక్సెస్ (SIM Card Access) చేస్తే.. మీ నంబరు ఉపయోగించి ఎలాంటి కార్యకలాపాలకైనా పాల్పడే ముప్పుందని వెల్లడించారు. ఇలాంటి కేసుల్లో మీ నంబరుతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడి వాటిలో మిమ్మల్ని నేరగాళ్లుగా చేసే కుట్ర పన్నే అవకాశం కూడా ఉంటుందని పోలీసులు అప్రమత్తం చేశారు.






