తెలంగాణలో ఇవాళ, రేపు వానలే వానలు

Mana Enadu : పగలంతా ఎండ, ఉక్కపోతతో రాష్ట్ర ప్రజలు విలవిలలాడిపోతున్నారు. సాయంత్రం కాగానే వరణుడి బీభత్సానికి వణికిపోతున్నారు. గత వారం రోజులుగా రాష్ట్రంలో భిన్న వాతావరణం కనిపిస్తోంది. సాయంత్రం కాగానే వాన దంచికొడుతోంది. అయితే రాష్ట్రంలో మరో రెండ్రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించారు.

మరో రెండ్రోజులు వానలు

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గురు, శుక్రవారాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గంటకు 40-50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించారు. బంగాళాఖాతంలో కొనసాగిన అల్పపీడన ప్రభావం బుధవారం బలహీనపడిందని చెప్పారు. దీని అనుబంధ ఉపరితల ఆవర్తనం దక్షిణ ఛత్తీస్‌గఢ్, దాని పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 5.8 కి.మీ. ఎత్తు వరకు కొనసాగుతోందని వివరించారు.

ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

ఈ ప్రభావం రాష్ట్రంపై తీవ్రంగా ఉంటుందని అధికారులు తెలిపారు. దీనివల్ల రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. ముఖ్యంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, భూపాలపల్లి, కామారెడ్డి జిల్లాల్లో ఈదురుగాలులతో భారీ వర్షాలు పడతాయని చెప్పారు.

భారీ వర్షపాతం నమోదు

మరోవైపు బుధవారం రోజున రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. ములుగు జిల్లా ఏటూరు నాగారంలో 123.3 మి.మీ. వాన కురిసింది. ఇక సూర్యాపేట జిల్లా టేకుమట్లలో 56.5 మి.మీ వర్షం పడింది. ఆదిలాబాద్‌ జిల్లా బజార్‌హత్నూర్‌లో 46, వరంగల్‌ జిల్లా ఏనుగల్‌లో 45, సంగారెడ్డి జిల్లా మాల్‌చెల్మలో 44.8, కామారెడ్డి జిల్లా లింగంపేటలో 42.8 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Share post:

లేటెస్ట్