
ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మ్యాచ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఛాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy-2025)లో భాగంగా ఈ మధ్యాహ్నం 2.30 గంటలకు దుబాయ్(Dubai) వేదికగా చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్(India vs Pakistan) జట్లు తలపడనున్నాయి. చాలా రోజుల తర్వాత ఈ ఇరు జట్లు పోటీపడుతుండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. దాయాదుల పోరులో ఎవరు గెలుస్తారని క్రికెట్ ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. తొలి మ్యాచులో నెగ్గిన భారత్ ఫుల్ జోష్‌లో ఉండగా.. సొంతగడ్డపై జరిగిన ఫస్ట్ మ్యాచులోనే పాక్ ఘోర ఓటమి మూటగట్టుకుంది. దీంతో ఈ మ్యాచు ఆ జట్టుకు అత్యంత కీలకంగా మారింది.
ఒత్తిడిలో రిజ్వాన్ సేన
దాయాదుల పోరు ప్రారంభం కానుంది. ఇక ఓపెనింగ్ మ్యాచ్‌లోనే ఓటమి పాలైన ఆతిథ్య పాకిస్థాన్‌కు ఈ గేమ్ చాలా కీలకం. ఇందులో ఓడితే పాక్ సెమీస్ అవకాశాలు దాదాపు ముగిసినట్టే. అందుకే ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలనే కసితో పాక్ బరిలోకి దిగుతోంది. ఇరు జట్ల బలబలాలను పరిశీలిస్తే భారత్ కే ఫేవరెట్‌గా కనిపిస్తోంది. అయితే, పాక్‌ను తక్కువ అంచనా వేయడానికి లేదు. ఆ జట్టు ఎప్పుడు ఎలా ఆడుతోంది చెప్పలేం. ఇదిలా ఉండగా ఇవాళ ప్రాక్టీస్‌కు ఆ జట్టు స్టార్ బ్యాటర్ బాబర్ ఆజమ్(Babar Azam) రాకపోవడంతో అతడు ఈ మ్యాచులో ఆడతాడా? లేదా? అనే సందేహం నెలకొంది.
టాస్ గెలిస్తే బ్యాటింగే..
ఈరోజు పిచ్(Pitch) ప్రారంభంలో బౌలర్లకు అనుకూలంగా ఉంటుందని అంచనా. సీమర్లు పోటీలో పెద్ద పాత్ర పోషించే అవకాశం ఉంది. ఆట కొసాగుతున్న కొద్దీ బ్యాటింగ్(Batting) కష్టమవుతుందని అంచనా. ఇక 50 ఓవర్ల మ్యాచ్‌లో మిడిల్ ఓవర్లలో స్పిన్నర్లు(Spinners) కీలక పాత్ర పోషిస్తారు. అందువల్ల టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. ఈరోజు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో వర్షం పడే అవకాశం కేవలం ఒక శాతం మాత్రమే ఉందని దుబాయ్ వాతావరణ శాఖ(Dubai Meteorological Department) వెల్లడించింది.