
దేశ వ్యాప్తంగా ఎమ్మెల్యేల ఆర్థిక, నేర, రాజకీయ నేపథ్యానికి సంబంధించి అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) నివేదిక విడుదల చేసింది. ఇందులో దేశంలోనే అత్యంత ధనిక ఎమ్మెల్యేగా మహారాష్ట్రకు చెందిన బీజేపీ నేత పరాగ్ షా (Parag Shah) నిలిచారు. ఆయన ముంబయిలోని ఘాట్కోపర్ తూర్పు నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన ఆస్తుల విలువ సుమారు రూ.3,400 కోట్లు.
రెండో స్థానంలో డీకే శివకుమార్
ఇక దేశంలోని అత్యంత సంపన్న ఎమ్మెల్యేల జాబితాలో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ (DK Shiva Kumar) రూ.1413 కోట్ల విలువైన ఆస్తులతో రెండో స్థానంలో ఉన్నారు. అత్యంత పేద ఎమ్మెల్యేగా బంగాల్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే నిర్మల్ కుమార్ ధారా (Nirmal Kumar Dhara) చివరి స్థానంలో ఉన్నారు. ఆయన ఆస్తుల విలువ కేవలం రూ.1700 మాత్రమే.
24 మంది వివరాలు పరిశీలించలేకపోయాం
ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే అభ్యర్థులు దాఖలు చేసిన అఫిడవిట్లను పరిశీలించిన ఏడీఆర్ (ADR Report 2025) తాజాగా ఈ నివేదికను విడుదల చేసింది. దేశంలోని మొత్తం 28 రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 4,092 ఎమ్మెల్యేల వివరాలను విశ్లేషించింది. ఆర్థిక వివరాలు, కేసులు వంటి అంశాలను విశ్లేషించి రిపోర్టు రెడీ చేసింది. అయితే దస్త్రాలు సరిగ్గా స్కాన్ చేయకపోవడం వల్ల 24 మంది ఎమ్మెల్యేల అఫిడవిట్లను పరిశీలించలేకపోయినట్లు ఏడీఆర్ తెలిపింది.
చంద్రబాబు, జగన్ కూడా రిచ్
పరాగ్ షా, డీకే శివకుమార్ తో పాటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) కూడా ధనవంతులేనని ఏడీఆర్ రిపోర్టు పేర్కొంది. ఆయన ఆస్తుల విలువ మొత్తం రూ.931 కోట్లు ఉందని తెలిపింది. ఇక ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy) రూ.757 కోట్ల ఆస్తులతో ధనవంతుల ఎమ్మెల్యే జాబితాలో నిలిచారని వెల్లడించింది. ఏపీకి చెందిన టీడీపీ ఎమ్మెల్యే పి.నారాయణ ఆస్తుల విలువ రూ.824 కోట్లు ఉందని వివరించింది.