Mana Enadu: భద్రాచలంలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభిస్తారు. ఈ పథకం కింద సొంత జాగా ఉన్న వారు ఇళ్లు నిర్మించుకోవడానికి రూ.5లక్షల ఆర్థిక సాయం, ఇళ్లు లేని నిరుపేదలకు స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి రూ.5లక్షల ఆర్థిక సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది.
ఆరు హామీల్లో భాగమైన ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ(మార్చి 11) భద్రాచలంలో ప్రారంభించనున్నారు. మొదటి దశలో ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 3,500 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున ఇళ్లు నిర్మించుకోనున్నారు. ఐదేళ్లలో స్వయం సహాయక బృందాలకు (SHG) లక్ష కోట్ల రూపాయల సాయం అందించే మరో బృహత్తర పథకాన్ని రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. స్వయం సహాయక సంఘాల సాధికారత కోసం ప్రభుత్వ సాయం, ఇతర కార్యాచరణ ప్రణాళికలను బహిరంగ సభలో రేవంత్ రెడ్డి ప్రకటించనున్నారు.
తెలంగాణ మహిళలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తీపి కబురు అందించారు. ఈ నెల 12న(రేపు) ఇందిరా క్రాంతి పథకాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ పథకం కింద మహిళలకు వడ్డీ లేని రుణాలను అందించనున్నట్లు పేర్కొన్నారు. ఈ పథకం వల్ల మహిళలు చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసుకొని మహిళలు ఉపాధి అవకాశాలు కల్పించవచ్చు అని అన్నారు. మహిళలను మహాలక్ష్మిలుగా చేయడమే తమ ప్రభుత్వం ఎజెండా అని అన్నారు.