ManaEnadu:డబ్బులు ఊరికే రావు అని ఓ పెద్దాయన అన్నట్టు ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బును జాగ్రత్తగా ఖర్చు చేయాలి. డబ్బు పొదుపు(Money Savings) చేయడం సంపాదించడంతో సమానం అని కొందరంటే, సంపాదించిన డబ్బును రెండింతలు చేయడం మంచిదని ఇంకొందరు అంటున్నారు. ఏదేమైనా డబ్బు సంపాదించగానే సరిపోదని, ఓ క్రమ పద్ధతిలో ఖర్చు చేయాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ఫ్యూచర్(Future) కోసం సక్రమంగా పెట్టుబడులు పెట్టాలని, ఈ క్రమంలో కొన్ని సూత్రాలు తప్పక పాటించాలని చెబుతున్నారు. మరి ఆ సూత్రాలేంటంటే?
క్రెడిట్ కార్డ్ లిమిట్
చాలా మంది ఇప్పుడు అవసరం ఉన్నా లేకపోయినా క్రెడిట్ కార్డు(Credit card)తీసుకుంటున్నారు. విపరీతంగా వాడేస్తున్నారు. నెలాఖరును బిల్లు కట్టాల్సి వచ్చినప్పుడు తలలు పట్టుకుంటున్నారు. అందుకే క్రెడిట్ కార్డు పరిమితిలో ఎప్పుడూ 30 శాతానికి మించి వాడకూడదని నిపుణులు చెబుతున్నారు. అంటే మీ కార్డు లిమిట్ లక్ష రూపాయలు ఉంటే నెలలో రూ.30వేలకు మించి కార్డు వాడకుండా జాగ్రత్త తీసుకోవాలి.
జీతంలో 15% ఇన్వెస్ట్ చేయాలి :
మీ జీతం/ఆదాయంలో కనీసం 10 నుంచి 15 శాతం ఫ్యూచర్ కోసం ఇన్వెస్ట్(Invest) చేయాలి. మీ శాలరీ రూ.60 వేలు ఉందనుకోండి అందులో 15 శాతం అంటే రూ.9వేలు ఎందులోనైనా పెట్టుబడి పెట్టాలన్నమాట.
జీతంలో 70% :
మీకు ప్రస్తుతం వస్తున్న ఆదాయంలో కనీసం 70 శాతం పదవీ విరమణ(Retirment) తర్వాత వచ్చేలా ప్లాన్ చేసుకోవాలి. అంటే ప్రస్తుతం మీ జీతం లక్ష రూపాయలు అనుకుంటే రిటైర్మెంట్ తర్వాత మీకు రూ.70వేలు ఆదాయం ఉండాలన్నమాట. అలా అయితేనే నేటి జీవనశైలిలో బతకగలం.
10 శాతం మించొద్దు:
మీరు షేర్స్, ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తుంటారా. అయితే మీ మొత్తం పెట్టుబడిలో 10 శాతానికి మించి ఒకే షేర్‌లో పెట్టొద్దు. మీ పెట్టుబడి రూ.10 లక్షలు ఉంటే ఒకే షేర్ లేదా ఒకే ఫండ్‌లో రూ. లక్షకు మించి ఉండొద్దన్నమాట.
24 గంటలు ఎదురుచూడాలి :
చాలా మంది షాపింగ్(షాపింగ్) వెళ్లినప్పుడు కంటికి ఏది కనిపిస్తే అది కొనేస్తుంటారు. అది అవసరమో కాదో కూడా చూసుకోరు. ఆ తర్వాత డబ్బంతా ఖర్చు చేశామని బోరుమంటారు. అందుకే ఏదైనా వస్తువు కొనాలని అనుకున్నప్పుడు కనీసం 24 గంటలు ఎదురుచూడాలి. ఆ తర్వాతే కొనాలా వద్దా అని నిర్ణయించుకోవాలి.