పీరియడ్స్ సమయంలో తలస్నానం(Washing Your Hair During Periods) చేయకూడదని పెద్దలు చెప్పడం మనందరికీ తెలుసు. కానీ దీనికి శాస్త్రీయ ఆధారం లేదని గైనకాలజిస్ట్ డాక్టర్ జ్యోతి చెబుతున్నారు. పీరియడ్స్ అనేది సహజమైన ప్రక్రియ. ఈ సమయంలో కడుపునొప్పి, శరీర నొప్పులు, తిమ్మిరి వంటి సమస్యలు రావడం సాధారణం. ఇలాంటి పరిస్థితుల్లో చల్లటి నీటితో తలస్నానం చేస్తే అలసటగా అనిపించవచ్చు. రోగనిరోధక శక్తి కొద్దిగా బలహీనమై ఉండే క్రమంలో శరీరానికి ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది.
అందుకే పూర్వం పెద్దలు తలస్నానం చేయొద్దని చెప్పి ఉండవచ్చు. అయితే గోరువెచ్చని నీటితో తలస్నానం చేయడం వల్ల ఎలాంటి హానీ ఉండదు. ఇది కండరాలను సడలించి, పీరియడ్స్ నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. తలస్నానం చేయడం వలన శరీరం ఫ్రెష్‌గా మారి అసౌకర్యం తగ్గుతుంది.
ముఖ్యంగా పీరియడ్స్ సమయంలో చల్లని నీటితో కాకుండా గోరువెచ్చని నీటితో తల స్నానం చేస్తే ఎటువంటి సమస్య రాదు. పీరియడ్స్‌లో తలస్నానం సంతానోత్పత్తి లేదా గర్భాశయంపై ఎలాంటి ప్రభావం చూపదని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. కాబట్టి ఇది కేవలం ఒక అపోహ మాత్రమే.
గమనిక: ఇది సాధారణ సమాచారం మాత్రమే. అనుమానాలు ఉంటే తప్పనిసరిగా వైద్యుల సలహా తీసుకోవాలి.






