IT Sector: ఐటీ జాబ్ కోసం బెంగళూరు వెళ్తున్నారా? మీకో బ్యాడ్‌న్యూస్.. కొత్త ఉద్యోగాలపై కీలక రిపోర్ట్!

మీరు ఐటీ ఉద్యోగం కోసం బెంగళూరు వెళ్లాలని భావిస్తున్నారా? అయితే, మీకో బ్యాడ్‌న్యూస్ అనే చెప్పాలి. బెంగళూరు కంపెనీలు కొత్త నియామకాల్లో ఆచితూచి అడుగులు వెస్తున్నాయి. ఈ ఏడాది 2023 తొలి 6 నెలలతో పోలిస్తే వచ్చే ఆరు నెలల్లో ఫ్రెషర్స్ నియామకాలు భారీగా తగ్గిపోనున్నాయి. బెంగళూరులోని కంపెనీలు తొలి అర్ధభాగంలో 75 శాతం కంపెనీలు ఫ్రెషర్స్ నియామకాలు చేపట్టగా.. ఆ సంఖ్య 65 శాతానికి పడిపోనుందని బెంగళూరుకు చెందిన టీమ్ లీజ్ గ్రూప్ సంస్థ టీమ్ లీజ్ ఎడ్యుటెక్ సర్వే తెలిపింది.

వచ్చే 6 నెలల్లో కేవలం 65 శాతం కంపెనీలే ఫ్రెషర్స్ నియామకాలు చేపట్టేందుకు సుముఖంగా ఉన్నట్లు ఈ సర్వే తెలిపింది. అంటే.. 2023 తొలినాళ్లలో ఉన్నన్ని ఉద్యోగాలు ఉండవని అర్థం చేసుకోవచ్చు. మరోవైపు.. స్టాఫింగ్ సంస్థ ఫినో డేటా ప్రకారం ఐటీ సర్వీసెస్ దిగ్గజ సంస్థలు ఈ ఆర్థిక ఏడాది 2023- 24లో మొత్తం నియామకాలను 40 శాతం మేర తగ్గించాలని నిర్ణయించినట్లు తెలుస్తోందని టీమ్ లీజ్ సర్వే తెలిపింది. ఇయర్ ఆన్ ఇయర్ పరంగా పోల్చి చూస్తే బెంగళూరులో నియామకాలు భారీగా పడిపోయాయి. ఈ అనిశ్చిత పరిస్థితుల్లోనూ ఓ శుభవార్త ఏంటంటే దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో చూస్తే ఫ్రెషర్స్ హైరింగ్‌లో బెంగళూరే టాప్ లో ఉంది. ఇక్కడ 68 శాతం కంపెనీలు నియామకాలు చేపట్టగా.. ఆ తర్వాత రెండో స్థానంలో ముంబై 61 శాతం, మూడో స్థానంలో చెన్నై 47 శాతంతో ఉన్నాయి. టీమ్ లీజ్ నివేదిక ప్రకారం.. 2023 రెండో అర్ధభాగంలో బెంగళూర కంపెనీలు చేపట్టనున్న నియామకాల్లో ఎక్కువగా ఎంబడెడ్ ఇంజనీర్ 65 శాతంగా ఉన్నాయి.

ఆ తర్వాత మెషీన్ లర్నింగ్ ఇంజనీర్ 56 శాతం, జూనియర్ ఎస్‌సీఎం అనలిస్ట్ 43 శాతం, అప్లికేషన్ ఇంజనీర్ 55 శాతంగా ఉన్నాయి. అలాగే బెంగళూరు కంపెనీల్లో 9 శాతం కంపెనీలు డిగ్రీ అప్రెంటీలను సైతం ఉద్యోగాల్లోకి తీసుకునేందుకు సుముఖంగా ఉన్నట్లు నివేదిక తెలిపింది. ఆ తర్వాత చెన్నై, పుణెలు ఉన్నాయి. డిజిటల్ మార్కెటింగ్, బిజినెస్ కమ్యూనికేషన్, డేటా సైన్స్, బ్లాక్ చైన్ వంటి సర్టిఫికేషన్ పూర్తి చేసిన ఫ్రెషర్స్‌కి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని తెలిపింది. ఈ నివేదిక ప్రధానంగా ఉన్నత విద్యా సంస్థల్లో పాఠ్యాంశాల్లో మార్పులు చేసేందుకు కారణమవుతుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. మార్కెట్లో ఉన్న అవకాశాలకు తగ్గట్లుగా కొత్త కోర్సులను ప్రవేశపెట్టడం, నైపుణ్యాలను మెరుగుపరిచే అవకాశాలు కల్పించే వంటి వాటిని ఏర్పాటు చేయాలని సూచిస్తోందని తెలిపారు.

Share post:

లేటెస్ట్