మన ఈనాడు: కొత్తగూడెంలో ఎన్నికల గేమ్ షురూ అయింది. వనమా నామినేషన్ ను తిరస్కరించండి అంటూ ఇండిపెండెంట్ అభ్యర్ధి జలగం వెంకట్రావ్ రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. వనమా ఎన్నికల అఫిడవిట్ తప్పుగా ఉందంటూ ఆరోపణలు చేస్తున్నారు.
ఎలా అయినా గెలవాలనే పట్టుదలతో ఉన్నట్టున్నారు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావ్. దాని కోసం కొత్త గేమ్ ను స్టార్ట్ చేశారు. కొత్తగూడెం బీఆర్ఎస్ అభ్యర్ధి వనమాను ఎన్నికల పోటీ నుంచి తప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. వనమా వెంకటేశ్వరరావు నామినేషన్ తిరస్కరించాలని రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. ఐపీసీ 170 ప్రకారం కొత్తగూడెం బీఆర్ఎస్ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు నామినేషన్ తిరస్కరించాలని జలగం అభ్యర్ధిస్తున్నారు. వనమా ఎన్నికల అఫిడవిట్ తప్పుగా ఉన్న అంశాలను ఎత్తి చూపిస్తున్నారు. అఫిడవిట్ లో సమగ్ర ఆస్తుల వివరాల ప్రకటన, పెండింగ్ పన్నులు, చలాన్లను వనమా ప్రస్తావించలేదంటూ ఆధారాలతో సహా రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు జలగం వెంకట్రావ్.
2018 సార్వత్రిక ఎన్నికల అనంతరం ఎన్నికల అఫిడవిట్ లో వనమా పొందుపరిచిన సమాచారం ఆధారంగా తాను న్యాయ పోరాటం చేస్తున్నాని జలగం చెబుతున్నారు. నామినేషన్ తిరస్కరణ అభ్యర్థన విషయంలో తీసుకోబోయే నిర్ణయాన్ని లిఖితపూర్వకంగా తెలపాలని ఆయన కోరారు. జలగం పిటిషన్ ఆధారంగా వనమాపై హైకోర్టు ధర్మాసనం అనర్హతవేటు వేసింది. కొత్తగూడెం ఎమ్మెల్యేగా జలగం వెంకట్రావ్ ను పరిగణించాలని తీర్పు చెప్పింది.
అయితే దీని మీద వెంటనే స్పందించిన వనమా వెంకటేశ్వర్రావు తన అనర్హత వేటు మీద పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఈ తీర్పుపై కోర్టు స్టే ఇచ్చింది. జనవరి తొమ్మిదికి విచారణ వాయిదా వేసింది. ప్రస్తుతం జలగం ఫిర్యాదు జిల్లా రిటర్నింగ్ అధికారికి చేరింది. ఈయన నిర్ణయం బట్టే వనమా ఎన్నికల్లో పాల్గొనవచ్చా లేదా అన్న విషయం ఆధారపడి ఉంటుంది. దీంతో కొత్తగూడెం, బీఆర్ఎస్ పార్టీలో అంతా ఉత్కంఠత నెలకొంది.