ManaEnadu : జమ్ముకశ్మీర్‌లో (Jammu Kashmir)ని 26 అసెంబ్లీ స్థానాలకు నేడు (సెప్టెంబరు 25వ తేదీ 2024) రెండోవిడత పోలింగ్ (Second Phase Polling) ప్రారంభమైంది. ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు ఓటింగ్ కొనసాగనుంది. రెండో విడతలో 26 అసెంబ్లీ స్థానాల్లో 239 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. పీర్ పంజాల్ పర్వత శ్రేణికి ఇరువైపులా ఉన్న శ్రీనగర్, బుద్గాం, రాజౌరి, పూంచ్, గందర్‌బల్, రియాసి జిల్లాల్లోని 26 స్థానాలకు ఈరోజు పోలింగ్ జరుగుతోంది. మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah), బీజేపీ జమ్ముకశ్మీర్ చీఫ్ రవిందర్ రైనా, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు తారిఖ్ హమీద్ కర్రా సహా పలువురు కీలక నేతలు ఈ విడతలో బరిలో నిలిచారు.
సరిహద్దు జిల్లాలపై పటిష్ఠ నిఘా
రెండో విడత పోలింగ్ దృష్ట్యా రాజౌరీ సహా సమస్యాత్మక ప్రాంతాల్లో అధికారులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎన్నికలు జరుగుతున్న 6 జిల్లాల సరిహద్దుల్లో నిఘా పెంచారు. ఈనెల 18న తొలిదశ పోలింగ్ (Jammu Kashmir Elections 2024) జరిగిన విషయం తెలిసిందే. మొదటి దశలో 61.38 శాతం ఓటింగ్ నమోదైంది. అక్టోబర్ 1వ తేదీన మిగిలిన 40స్థానాలకు చివరి విడత పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 8వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
25.78 లక్షల మంది ఓటర్లు
రెండో విడతలో 25.78 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మొత్తం 3502 పోలింగ్ కేంద్రాల్లో (Polling Stations) ఓటింగ్ జరగనుండగా.. 1,056 పోలింగ్ కేంద్రాలు పట్టణాల్లో, 2,446 పోలింగ్ కేంద్రాలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌క్యాస్టింగ్ సౌకర్యాలు ఏర్పాటు చేసి నిరంతరం నిఘా ఉంచారు.
బరిలో 239 మంది అభ్యర్థులు
ఈ దఫా ఎన్నికల్లో బీర్వా, గందర్‌బల్ సెగ్మెంట్లు ఆసక్తికరంగా ఉన్నాయి. ఈ రెండు చోట్ల నుంచి జైలులో ఉన్న వేర్పాటువాద నాయకుడు సర్జన్ అహ్మద్ వాగే అలియాస్ బర్కతి- పోటీ చేయడమే కారణం. శ్రీనగర్ (Srinagar Polling) జిల్లాలో పోలింగ్ జరగనున్న 93 మంది అభ్యర్థులు, బుద్గాం జిల్లాలోని46, రాజౌరి జిల్లాలోని 34, పూంచ్ జిల్లాలో 25, గందర్‌బల్ జిల్లాలో 21 మంది, రియాసి జిల్లాలో 20 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.