ManaEnadu:కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. సీఎం కుటుంబానికి మంగళూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ-MUDA స్థలం కేటాయింపు వ్యవహారంపై గవర్నర్ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. తాజాగా గవర్నర్ నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించింది. స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే అధికారం గవర్నర్‌కు ఉందని స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే గవర్నర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య దాఖలు చేసిన పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు కొట్టివేసింది.
ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై విచారణ జరిపేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీఎం సిద్ధరామయ్య భార్య పార్వతమ్మ పేరిట మైసూరు ప్రాంతంలో ఉన్న భూములను గతంలో అభివృద్ధి పనుల కోసం ముడా సేకరించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పరిహారంగా ఆమెకు మైసూరు-విజయనగరంలో ఖరీదైన స్థలాలు కేటాయించింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మౌఖిక ఆదేశాలతోనే ముడా అధికారులు ఆమెకు ఖరీదైన ప్రాంతంలో విలువైన స్థలాలు కట్టబెట్టారని ప్రతిపక్ష బీజేపీ, జేడీఎస్ ఆరోపణలు చేశాయి.
ఈ ఆరోపణలతోనే ముగ్గురు సామాజిక కార్యకర్తలు ఎస్పీ ప్రదీప్ కుమార్, టీజే అబ్రహం, స్నేహమయి కృష్ణలు గవర్నర్ కు సీఎం సిద్ధరామయ్యపై ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఫిర్యాదులో కోరారు. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంలో ఎందుకు విచారణకు ఆదేశించకూడదో తెలపాలని గవర్నర్ తొలుత ముఖ్యమంత్రికి షోకాజ్ నోటీసులు ఇచ్చారు. ఆ తర్వాత సిద్ధరామయ్యపై విచారణకు అనుమతించారు.
అయితే గవర్నర్ ఆదేశాలపై సిద్ధరామయ్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం గవర్నర్ చర్యను సమర్థిస్తూ.. సీఎంపై విచారణకు అనుమతించింది. విచారణ జరిపే వరకూ ఆయనపై ఎలాంటి తక్షణ చర్యలు తీసుకోవద్దని ట్రయల్ కోర్టును హైకోర్టు ఆదేశించింది.