‘లారెన్స్‌ బిష్ణోయ్‌ని ఎన్‌ కౌంటర్‌ చేస్తే రూ.కోటి రివార్డు’

Mana Enadu : మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్​సీపీ నేత బాబా సిద్ధిఖీ హత్యతో గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌(Lawrence Bishnoi) పేరు మరోసారి దేశవ్యాప్తంగా మార్మోగుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం లారెన్స్‌ బిష్ణోయ్‌ జైల్లో ఉన్నాడు. అయితే అతడిని ఎన్‌కౌంటర్‌ చేసిన పోలీసులకు రూ.కోటికి పైగా నజరానా ఇస్తామని క్షత్రియ కర్ణి సేన(Kshatriya Karni Sena) రివార్డు ప్రకటించింది.

అతణ్ని చంపితే కోటి రూపాయల నజరానా

‘‘లారెన్స్ బిష్ణోయ్‌ను ఎన్‌కౌంటర్ చేసిన ఏ పోలీసు అధికారికైనా మేం భద్రత కల్పిస్తాం. వారి కుటుంబ భవిష్యత్తు కోసం రూ.కోటికి పైగా ఇస్తాం. ఈ గ్యాంగ్‌ ఎన్ని హత్యలకు పాల్పడుతున్నా కేంద్ర ప్రభుత్వం, గుజరాత్‌ అధికారులు వారిపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. అన్నింటిని చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. మా అధినేత సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడిని చంపిన వారిని వదిలేది లేదు’’ అని జాతీయ అధ్యక్షుడు రాజ్ షెకావత్ (raj shekhawat) ఓ వీడియో రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది.

అందుకే చంపాం

కాగా 2023, డిసెంబర్‌లో రాష్ట్రీయ రాజ్‌పుత్‌ కర్ణిసేన అధ్యక్షుడు సుఖ్‌దేవ్‌ సింగ్‌ గోగామేడీ(Sukhdev Singh Gogamedi)ని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపగా.. అనంతరం ఆయన్ను తామే హత్య చేసినట్లు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌ ప్రకటించింది. ఇక తాజాగా NCP (అజిత్‌ పవార్‌ వర్గం) సీనియర్‌ నేత, సల్మాన్‌ ఖాన్‌ (Salman Khan) స్నేహితుడు బాబా సిద్ధిఖీ(Baba Siddique)ని హత్య చేసింది కూడా తామేనని ఇదే గ్యాంగ్‌ ఓ ప్రకటన రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. సిద్ధిఖీకి కూడా అండర్‌ వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీంతో సంబంధాలు ఉండటంవల్లే హత్య చేసినట్లుగా పేర్కొంది.

Share post:

లేటెస్ట్