
ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ (MLA Quota MLA Candidate) అభ్యర్థిగా జనసేన ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబునామినేషన్ దాఖలు చేశారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, టీడీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస రావు.. నాగబాబు అభ్యర్థిత్వాన్ని బలపరిచారు. ఈ నేపథ్యంలో రిటర్నింగ్ అధికారిణి వనితారాణికి నాగబాబు (Konidela Nagababu) నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్యేలు బొలిశెట్టి శ్రీనివాస్, కొణతాల రామకృష్ణ పాల్గొన్నారు.
ఇక నాగబాబు అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తూ 10 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు. ఇక సంతకాలు వారిలో మంత్రి నాదెండ్ల మనోహర్ (Minister Nadendla Manohar), ఎమ్మెల్యేలు పంతం నానాజీ, లోకం నాగ మాధవి, అరవ శ్రీధర్, మండలి బుద్ధప్రసాద్, సుందరపు విజయ్ కుమార్, పత్సమట్ల ధర్మరాజు, పంచకర్ల రమేష్ బాబు, ఆరణి శ్రీనివాసులు, బత్తుల బలరామకృష్ణ ఉన్నారు.
ఇక ఏపీ శాసనమండలిలో తాజాగా ఐదు స్థానాలు ఖాళీ కావడంతో అందులో ఒక స్థానం జనసేనకు దక్కనుంది. ఈ క్రమంలో ఆ సీటుకు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan).. నాగబాబు పేరును ప్రకటించారు. నాగబాబుకు కార్పొరేషన్ పదవి ఇస్తారనే ప్రచారం జరిగినా తాజా పరిణామాలతో వాటికి చెక్ పడింది. మరోవైపు మంత్రివర్గంలోనూ నాగబాబుకు చోటు కల్పిస్తామని చంద్రబాబు గతంలో ప్రకటించారు. త్వరలోనే దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.