Mana Enadu : మూసీ పునరుజ్జీవం ఎవరి కోసం చేస్తున్నారు? అని బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్(KTR) ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. స్థిరాస్థి వ్యాపారానికి కాదా? అని నిలదీశారు. మూసీ పేరు చెప్పి కాంగ్రెస్ దోచుకుంటోందని ఆరోపించారు. మూసీ బ్యూటిఫికేషన్(Musi Beautification)కు తాము వ్యతిరేకం కాద్న ఆయన.. లూటిఫికేషన్‌కు మాత్రం వ్యతిరేకం అని స్పష్టం చేశారు. మూసీ నిర్వాసితులకు బీఆర్ఎస్ పార్టీ(BRS Party) అండగా ఉంటుందని భరోసా కల్పించారు. జీహెచ్ఎంసీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి కేటీఆర్ నాచారంలోని ఎస్టీపీని పరిశీలించారు.
మా హయాంలో మురుగునీటి శుద్ధికి రూ.4 వేల కోట్లు
అనంతరం మాట్లాడుతూ.. ‘‘రుణమాఫీకి, రైతుబంధు(Rythu Bandhu)కు ప్రభుత్వం వద్ద పైసలు లేవన్నారు. ఏ పథకం అమలు చేయాలన్నా పైసలు లేవని మంత్రులు చెబుతున్నారు. మూసీ పునరుజ్జీవానికి మాత్రమే ప్రభుత్వం వద్ద పైసలు ఉన్నట్లున్నాయి. ఇందుకు రూ.లక్షన్నర కోట్లు ఖర్చు చేయనున్నట్లు సీఎం చెబుతున్నారు. కేసీఆర్(KCR) హయాంలో హైదరాబాద్‌లో మురుగు నీటి శుద్ధికి సుమారు రూ.4 వేల కోట్లు కేటాయించాం. అప్పుడు నిర్మించిన ఎస్టీపీలనే సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. కేసీఆర్ ఎప్పుడో మూసీ పునరుజ్జీవం పనులు మొదలుపెట్టారు. ఇప్పుడు మీరు వచ్చి కొత్తగా చేయాల్సింది ఏమీ లేదు అని కేటీఆర్ అన్నారు.
హైదరాబాద్ అభివృద్ధిలో మా కృషి
హైదరాబాద్ విశ్వనగరంగా ఎదగడంలో కేసీఆర్ సర్కార్ ఎంతో కృషి చేసిందని కేటీఆర్ అన్నారు. పదేళ్ల పాటు ప్రణాళికా బద్ధంగా ఒక్కో రంగాన్ని సరిదిద్దుకుంటూ వచ్చామని తెలిపారు. ఇంటింటికీ నీళ్లు ఇచ్చే తొలి రాష్ట్రంగా తెలంగాణను మార్చామని వెల్లడించారు. హైదరాబాద్‌లో తాగునీరు, కరెంటు కష్టాలు లేకుండా చేశామని పేర్కొన్నారు. ప్రతిరోజు దాదాపు 20 కోట్ల లీటర్ల మురుగు నీటిని శుద్ధి(Sewage Treatment) చేసేలా చర్యలు తీసుకున్నామని కేటీఆర్ వివరించారు.
మూసీ మాటున దిల్లీకి మూటలు
మూసీపై 14 బ్రిడ్జిలు కట్టడానికి ప్రణాళిక రచించామన్న కేటీఆర్.. మొత్తం రూ.20 వేల కోట్లతో మూసీ అభివృద్ధికి ప్రణాళిక రచించామని చెప్పారు. ఇప్పుడు రేవంత్(CM Revanth Reddy) లక్షన్నర కోట్లతో మూసీ సుందరీకరణ అంటున్నారని.. దిల్లీకి మూటలు పంపేందుకు మూసీ మాటున మూటలు వెనకేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు.