మహిళలకు ఆర్థిక భద్రతను కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక కార్యక్రమాన్ని ప్రారంభించింది. గతేడాది డిసెంబర్ 9న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ‘ఎల్ఐసీ బీమా సఖీ యోజన’ ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ పథకం ద్వారా మహిళలను ఎల్ఐసీ ఏజెంట్లుగా తీర్చిదిద్దుతూ, వారికి స్థిరమైన ఆదాయ అవకాశాలను అందించనున్నట్లు కేంద్రం పేర్కొంది. ఈ స్కీం కింద ఒక్కో మహిళ ఏకంగా రూ.2 లక్షలు పొందొచ్చు.
ఈ పథకం కింద మహిళలకు బీమా రంగంపై శిక్షణ ఇవ్వడంతో పాటు, శిక్షణ కాలంలో నెలవారీ స్టైపెండ్ అందించనున్నారు. మొదటి ఏడాది రూ. 7,000, రెండో ఏడాది రూ. 6,000, మూడో ఏడాది రూ. 5,000 చొప్పున మొత్తం మూడేళ్లకు రూ. 2,16,000 వరకు లభించనుంది.
పథకానికి అర్హతలు:
మహిళల వయస్సు 18 నుంచి 70 ఏళ్ల మధ్య ఉండాలి.
కనీసం 10వ తరగతి పాసై ఉండాలి.
మూడు సంవత్సరాల శిక్షణ అనంతరం, మహిళలు ఎల్ఐసీ అధికారిక బీమా ఏజెంట్లుగా కొనసాగే అవకాశముంటుంది. అర్హత గల గ్రాడ్యుయేట్ బీమా సఖీలు, భవిష్యత్తులో డెవలప్మెంట్ ఆఫీసర్లుగా ఎదిగే అవకాశం కూడా కలుగుతుంది. అటు, ఎంపికైన బీమా సఖీలకు ప్రధాని మోదీ అపాయింట్మెంట్ సర్టిఫికెట్లు కూడా అందించనున్నారు. ఈ పథకం మొదటి దశలో 35,000 మంది మహిళలకు ఉపాధి కల్పించగా, తదుపరి దశలో మరింతగా విస్తరించి 50,000 మంది మహిళలకు లబ్ధి చేకూర్చేలా చర్యలు తీసుకోనున్నారు.
దరఖాస్తు ప్రక్రియ:
ఈ పథకం కోసం ఎల్ఐసీ అధికారిక వెబ్సైట్ విజిట్ చేసి.. ‘Recruitment of LIC’s BIMA SAKHI’ లింక్‌ను క్లిక్ చేయండి. అనంతరం పేరు, పుట్టిన తేది, మొబైల్ నంబర్, ఈమెయిల్ ID, చిరునామా వంటి వివరాలు నమోదు చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా, మహిళలకు ఆర్థికంగా స్వయం సమృద్ధి లభించడమే గాక.. LIC పోలిసీలు చేస్తుంటే పెద్ద ఎత్తున కమీషన్స్ కూడా లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా గ్రామీణ మహిళలకు ఇది చక్కటి ఉపాధి మార్గం అంటున్నారు ఆర్ధిక విశ్లేషకులు.







